ధర్మశాల : మంగళవారం ధర్మశాలలో జరిగే ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ -1లో(Qualifier 1 Match) హై ఓల్టేజ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌తో(RCB vs GT) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లోకి వెళ్లనుండగా ఓడిన జట్టుకు క్వాలిఫయర్ -2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. రెండు జట్లు 14 మ్యాచ్‌లలో 18 పాయింట్లతో సమంగా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించాయి. మెరుగైన నెట్ రన్-రేట్ కారణంగా ఆర్సీబీ, జీటీని అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొచి ఉండటంతో ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. అక్యూవెదర్ ప్రకారం నగరంలో సుమారు 14 నుండి 25 శాతం మేఘావృతమై ఉండటంతో పాటు 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో మ్యాచ్ కొనసాగడంపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మెరుగైన నెట్ రన్-రేట్ ఉన్న జట్టుకే మేలు జరుగుతుంది.
క్వాలిఫయర్ -1, ఎలిమినేటర్ లేదా క్వాలిఫయర్ 2కు రిజర్వ్ డే లేనందున లీగ్ దశ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన ఆర్సీబీ జట్టుకే ప్రయోజనం ఉంటుంది.
ఎందుకంటే 14 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలు, 18 పాయింట్లు, +0.78 ఆకట్టుకునే నెట్ రన్ రేట్‌తో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. కాగా, ఐపీఎల్ నిబంధనల ప్రకారం వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడితే 6 ఓవర్లకు కుదిస్తారు. లేదా సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించే అవకాశం ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఆర్సీబీ ఆత్మవిశ్వాసంతో క్వాలిఫయర్- 1లోకి అడుగుపెట్టగా ఎలాగైనా మరో కప్‌ను ఒడిసి పట్టాలని జీటీ ఉవ్విళ్లూరుతోంది.