Rahul Dravid | సఫారీల గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుచుకోవాలంటే ఫైనల్ జట్టులో మార్పులు చేయక తప్పదని టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పారు. టీంలో సీనియర్ ప్లేయర్లు ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం కొందరిని పక్కన పెట్టక తప్పదని తేల్చేశారు. ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ద్రావిడ్ మీడియాతో మాట్లాడాడు. తొలి టెస్ట్‌లో ఎవరెవరిని ఆడించాలో తమకు స్పష్టత ఉందని చెప్పాడు.
అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలతోపాటు జట్టు ఆటగాళ్లందరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడానని ద్రావిడ్ తెలిపాడు. ఫామ్ తిరిగి అందుకోవడానికి రహానే.. నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. తొలి టెస్ట్‌లో అజింక్య రహానే, ఇషాంత్ శర్మల్లో ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉందన్నాడు. జట్టులో ఎవరిని పక్కనబెడతామన్న విషయం ఇప్పుడు చెప్పట్లేదన్నాడు.
టాస్ తర్వాతే తుది టీమ్‌ను వెల్లడిస్తామని రాహుల్ ద్రావిడ్ వివరించాడు. సఫారీ గడ్డపై పిచ్‌ల మీద ఆడటం కష్టం అన్నాడు. తొలి టెస్ట్‌లో గెలిస్తేనే ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టొచ్చని చెప్పాడు. సఫారీలతో పోలిస్తే టీం ఇండియాకు పేస్ బౌలింగ్ టీం పటిష్ఠంగానే ఉన్నా, తమ ప్రత్యర్థులను తేలిగ్గా తీసుకోబోమని అన్నాడు. తుది జట్టును ఖరారు చేసే విషయమై సమతూకం పాటిస్తామని స్పష్టం చేశాడు.