న్యూఢిల్లీ: ఈ ఏడాది గ్రాండ్ స్లామ్ సీజన్ ప్రారంభ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్‌లో స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇవాళ రాడ్ లావెర్ ఎరీనాలో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మెటియో బెరెట్టినిపై నాదల్ 6-3, 6-2, 3-6, 6-3 తేడాతో ఘన విజయం సాధించాడు. నాదల్ ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి.
తొలి సెమీస్ గెలిచిన నాదల్ రెండో సెమీ ఫైనల్లో గెలిచిన ఆటగాడితో ఈ నెల 30 (ఆదివారం)న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాడు. రెండో సెమీఫైనల్ ఇవాళ సిట్సిపాస్, మెద్వెదేవ్ల మధ్య జరుగనుంది. ఫైనల్లో నెగ్గి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ నెగ్గితే అత్యంత అరుదైన రికార్డు నాదల్ సొంతం కానుంది. టెన్నిస్ చరిత్రలో అరుదైన ఘటన సాధించిన ఆటగాడిగా అతను నిలువబోతున్నాడు.
ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలిచిన స్పెయిన్ బుల్ నాదల్ ప్రస్తుతం ఇతర టెన్నిస్ దిగ్గజాలైన నొవాక్ జకోవిక్, రోజర్ ఫెదరర్‌తో కలిసి సమవుజ్జీగా ఉన్నారు. ఈ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంటే.. టెన్నిస్ చరిత్రలో 21 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ఏకైక ఆటగాడిగా రఫేల నాదల్ చరిత్ర సృష్టించనున్నాడు.