Kolkata Knight Riderగువాహటి : ఐపీఎల్-18 సీజన్‌ను ఓటమితో ఆరంభించిన డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. బుధవారం గువాహటిలోని బర్సపర స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 152 పరుగుల ఛేదనను కోల్‌కతా.. 17.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్, 8ఫోర్లు, 6సిక్స్‌లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. కోల్‌కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తి (2/17), మోయిన్ అలీ (2/23), వైభవ్ అరోరా (2/33) కట్టడి చేయడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. ధ్రువ్ జురెల్ (28 బంతుల్లో 33, 5 ఫోర్లు) టాప్ స్కోరర్. డికాక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
స్వల్ప లక్ష్య ఛేదనను కోల్‌కతా కూడా నెమ్మదిగానే ఆరంభించింది. పవర్ ప్లేలో ఆ జట్టు చేసింది 40 పరుగులే. 12 బంతులాడి 5 పరుగులే చేసిన ఓపెనర్ మోయిన్ అలీ రనౌట్ అయ్యాడు. మూడో స్థానంలో వచ్చిన సారథి రహానే (18) కూడా నిరాశపరిచాడు. కానీ ఆరంభంలో ఆచితూచి ఆడిన డికాక్.. క్రీజులో కుదురుకున్నాక బ్యాట్‌కు పనిచెప్పాడు. హసరంగ 11వ ఓవర్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదడంతో ఈ సీజన్లో అతడి తొలి అర్ధ సెంచరీ పూర్తయింది. రహానే నిష్క్రమించినా రఘువంశీ (22 నాటౌట్) సాయంతో డికాక్ మ్యాచ్‌ను ముగించాడు. డికాక్‌ను నిలువరించేందుకు రాజస్థాన్ తాత్కాలిక కెప్టెన్ పరాగ్ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయిం ది. బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న డికాక్ సమయోచిత ఇన్నింగ్స్‌తో ఈసీజన్లో జట్టుకు తొలి విజయాన్ని అందించాడు.
67/1. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 7.4 ఓవర్లకు చేసిన స్కోరిది. కానీ నాలుగు ఓవర్ల వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 11 ఓవర్లకు 82/5గా మారి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. గత మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన శాంసన్ (13) కోల్‌కతాతో విఫలమైనా ఓపెనర్ యశస్వీ (24 బంతుల్లో 29, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రియాన్ పరాగ్ (15 బంతుల్లో 25, 3 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టు ఇన్నింగ్స్ మెరుగ్గానే ఆరంభమైంది. హోంగ్రౌండ్లో 15 బంతుల్లోనే మూడు భారీ సిక్సర్లతో జోరు మీద కనిపించిన పరాగ్.. ఆ జోరును కొనసాగించలేకపోయాడు. కోల్‌కతా స్పిన్నర్లు వరుణ్, అలీ దెబ్బకు రాయల్స్ వరుస ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది. 8, 10వ ఓవర్లలో వరుణ్.. పరాగ్, హసరంగ(4)ను ఔట్ చేయగా 9, 11వ ఓవర్లలో మోయిన్.. జైస్వాల్, నితీశ్ (8)ను పెవిలియన్‌కు చేర్చాడు. శుభమ్ దూబే (9), హెట్మెయర్ (7) కూడా విఫలమయ్యారు. జురెల్ మెరుపులతో రాజస్థాన్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
రాజస్థాన్: 20 ఓవర్లలో 151/9 (జురెల్ 33, జైస్వాల్ 29, వరుణ్ 2/17, మోయిన్ 2/23);
కోల్‌కతా: 17.3 ఓవర్లలో 153/2(డికాక్ 97 నాటౌట్, రఘువంశీ 22 నాటౌట్, హసరంగ 1/34)