PV Sindu | స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. వెంకట దత్తసాయితో త్వరలోనే వివాహం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ సింధు, వెంకట దత్తసాయి రింగ్స్ మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ ఫొటోను సింధు ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నది. ఈ సందర్భంగా ‘ఒకరి ప్రేమనకు దక్కిన సమయంలో.. తిరిగి మనం ప్రేమించాలి’ అని క్యాప్షన్‌తో ఫొటోను షేర్ చేసింది. ఎంగేజ్మెంట్ సందర్భంగా ఇద్దరూ కేక్ కట్ చేశారు. ఇక పీవీ సింధు వివాహ వేడుక ఈ నెల 22న రాజస్థాన్‌లో జరుగనున్న విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
కాబోయే వరుడు హైదరాబాద్‌కు చెందిన ఐటీ ప్రొఫెషనల్. పొసిడెక్స్ టెక్నాలజీస్‌లో వెంకట దత్త సాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. వివాహం అనంతరం 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు కుటుంబాలకు ఎప్పటి నుంచో పరిచయం ఉండగా.. నెల రోజుల కిందట పెళ్లి ఫిక్స్ చేశారు. అయితే, జనవరి నుంచి సింధు వరుస టోర్నీలు ఆడనున్నది. అందుకే సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేయాలని భావించినట్లు పీవీ సింధు తండ్రి తెలిపారు. డిసెంబర్ 22న పెళ్లికి ముహూర్తం నిర్ణయించామని.. 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుందని తెలిపారు. సింధుకు రాబోయే సీజన్ కీలకమైందని.. దాంతో త్వరలోనే ప్రాక్టీస్ చేయనుందని తండ్రి రమణ పేర్కొన్నారు. పెళ్లి వేడుకలు ఈ నెల 20 నుంచి మొదలుకానున్నట్లు వివరించారు.