సిడ్నీ: ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నీలో హైదరాబాదీ ప్లేయర్ పీవీ సింధు(PV Sindhu) ఇవాళ సెమీఫైనల్లో ఓటమి చవి చూసింది. జపాన్‌కు చెందిన మేటి ప్లేయర్ అకేన్ యమగుచి చేతిలో ఆమె వరుస గేమ్స్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్నది. 20-22, 12-21 స్కోరుతో యమగుచి విజయం సాధించింది. మూడో నెంబర్ ర్యాంక్‌తో జపనీస్ ప్లేయర్ ఈ టోర్నీలో ఆడారు. కేవలం 43 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. సింధు ఓటమితో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్లో భారతీయ క్రీడాకారుల ప్రాతినిధ్యం ముగిసింది.
ఫస్ట్ గేమ్‌లో జపాన్ ప్లేయర్‌కు ధీటుగా సింధు ఆడింది. షాట్‌కు షాట్ కొట్టింది. ఇద్దరు ఆటగాళ్లు ఓ దశలో ఆరు వరుస పాయింట్లను సాధించుకున్నారు. కానీ గేమ్ పాయింట్ వద్ద సింధు తడబడింది. ఓపెనింగ్ గేమ్‌ను యమగుచి చేజిక్కించుకున్నది. ఇక సెకండ్ గేమ్‌లో సింధు ఆటతీరు పూర్తిగా మారిపోయింది. యమగుచి చాలా ఈజీగా దూసుకెళ్లింది. ఓ దశలో 13-6 పాయింట్లు సాధించింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండానే యమగుచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నది.
ఇక సింగిల్స్ ఫైనల్లో థాయ్‌ల్యాండ్ క్రీడాకారిణి పోర్న్‌పావీ చోచువాంగ్‌తో యమగుచి తలపడనున్నది. ఇటీవల కాలం యమగుచి చేతిలో సింధు వరుసగా ఓటమి ఎదుర్కొన్నది. ఆరు మ్యాచుల్లో అయిదు సార్లు ఓడంది. కానీ ఓవరాల్‌గా 15-13 తేడాతో సింధు లీడింగ్‌లో ఉంది.