న్యూఢిలీ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు షాక్. సొంతగడ్డపై ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆరో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన హైదరాబాదీకి తీవ్ర నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడి ఇంటిదారి పట్టింది. సంచలన విజయాలతో దూసుకెళ్తున్న యువ షట్లర్ ఆయుష్ శెట్టి కూడా ఇదే రౌండ్లో ఓడటంతో సింగిల్స్‌లో భారత ముగియగా.. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి క్వార్టర్ ఫైనల్ చేరి పతక ఆశలను సజీవంగా నిలిపారు. కెరీర్లో 11వ సారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తలపడుతున్న సింధు గురువారం జరిగిన ప్రిక్వారర్స్లో 11-21, 21-15, 17-21తో మూడో ర్యాంకర్, చైనా అమ్మాయి వాంగ్ జి యి చేతిలో పోరాడి ఓడిపోయింది.
దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం ఇద్దరు షట్లరు పోటాపోటీగా ఆడుతూ 7-7తో సమంగా నిలిచారు. ఈ దశలో 41 షాట్ల సుదీర్ఘ ర్యాలీ తర్వాత వాంగ్ ఆధిక్యంలోకి వెళ్లింది. సింధు చేసిన వరుస తప్పిదాలను అనుకూలంగా మలుచుకున్న చైనా షట్లర్ సులువుగా తొలి గేమ్ గెలుచుకుంది. కానీ, రెండో గేమ్‌లో పుంజుకున్న సింధు అద్భుతమైన నెట్ గేమ్‌తో పాటు క్రాస్ కోర్ట్ స్మాష్‌లతో చెలరేగి 3-0, 15-13 ఆధిక్యంలోకి వెళ్లింది. వాంగ్ కోలుకునేందుకు యత్నించినా, పట్టు వదలకుండా ఆడిన సింధు మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక గేమ్‌లో ఆట మరింత ఉత్కంఠగా సాగింది. ప్రారంభంలో బలమైన స్మాష్‌లతో విజృంభించిన భారత షట్లర్ 7-4, 13-10తో ముందంజలో నిలిచింది. కానీ వాంగ్ పోరాటం వదల్లేదు.
లాంగ్ ర్యాలీలతో సింధు సహనానికి పరీక్ష పెడుతూ 15-15 వద్ద స్కోరు సమం చేసింది. ఈ సమయంలో కాళ్ల కండరాల పట్టేయడంతో మెడికల్ టైమౌట్ తీసుకుంది. నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా కూడా పట్టుదలతో పోరాడిన చైనా ప్లేయర్ 54 షాట్ల సుదీర్ఘ ర్యాలీ ఆడింది. చివరకు సింధు షటిల్‌ను లైన్ అవతలకు కొట్టడంతో కీలక పాయింట్ నెగ్గి 19-17తో నిలిచిన వాంగ్ మరోసారి కండరాల నొప్పితో ఇబ్బంది పడింది. అయినా తను వెనక్కుతగ్గలేదు. ఇంకోవైపు చివరి క్షణాల్లో ఒత్తిడిలో పొరపాట్లు చేసే బలహీనతను మరోసారి బయటపెట్టింది. ఓ స్మాష్‌ను నెట్‌కు కొట్టడంతో వాంగ్ మ్యాచ్ పాయింట్‌పైకి వచ్చింది. భారత షట్లర్ తప్పిదాలను సొమ్ము చేసుకున్న చైనా అమ్మాయి మ్యాచ్‌ను కైవసం చేసుకొని క్వార్టర్స్ చేరుకుంది. వాంగ్ చేతిలో సింధుకు ఇది ఆరో ఓటమి కావడం గమనార్హం.
పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ షి యుచిని ఓడించి సంచలనం సృష్టించిన 21 ఏండ్ల ఆయుష్ శెట్టి టోర్నీలో ముందంజ వేయలేకపోయాడు. ప్రిక్వార్టర్స్‌లో అతను 19-21, 11-21తో 11వ సీడ్, ప్రపంచ 12వ ర్యాంకర్ అల్వీ ఫర్హాన్ (ఇండోనేషియా) చేతిలో వరుస గేమ్స్‌లో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో చివరి వరకూ పోరాడిన ఆయుష్ రెండో గేమ్‌లో పూర్తిగా తేలిపోయాడు. ఫర్హాన్‌తో ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆయుష్కు ఇది 5వ ఓటమి. మిక్స్డ్ డబుల్స్‌లో 15 సీడ్ ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో కూడా నిరాశ పరిచారు. ఈ ద్వయం 16-21, 5-21తో ఆరో సీడ్ గువో జిన్వా – చెన్ ఫాంగ్హుయ్ (చైనా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది.
తొలి రౌండ్లో బై, రెండో రౌండ్లో వాకోవర్‌తో నేరుగా ప్రిక్వార్టర్స్‌లో బరిలోకి దిగిన భారత్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. టైటిల్ ఫేవరెట్ అయిన ఐదో సీడ్ భారత ద్వయం 21-23, 21-19, 21-17తో జునైదీ ఆరిఫ్- యాప్ రాయ్ కింగ్ (మలేషియా) జంటపై హోరాహోరీ పోరులో థ్రిల్లింగ్ విజయం సాధించింది. గంటా 22 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ప్రత్యర్థులు విసిరిన సవాల్‌ను జయించింది. ఉత్కంఠగా సాగిన తొలి గేమ్‌ను కొద్దిలో కోల్పోయినా.. పట్టుదలతో ఆడిన సాత్విక్-చిరాగ్ తర్వాతి రెండు గేమ్‌లు నెగ్గి ముందంజ వేసింది.
మహిళల డబుల్స్‌లో అన్‌సీడెడ్ భారత ద్వయం పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ మరో సంచలన విజయం సాధించి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. ప్రిక్వార్టర్స్‌లో భారత ద్వయం 21-16, 21-12తో వరుస గేమ్స్‌లో ఏడో ర్యాంక్ జపాన్ జోడీ రిన్ ఇవానాగా – కీ నకానిషికి చెక్ పెట్టింది.

గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన ట్రీసా, గాయత్రితో కలిసి మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 2015లో గుత్తా జ్వాల – అశ్విని పొన్నప్ప తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్ చేరిన ద్వయంగా గాయత్రి-ట్రీసా నిలిచింది.