PV Sindhu | గాయం నుంచి కోలుకొని తిరిగి కోర్టులో అడుగుపెట్టినప్పటి నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకెళ్లింది. పదిలోపు ర్యాంక్ సాధించడం ఆర్నెళ్ల తర్వాత సింధుకు ఇదే తొలిసారి. తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్‌లో సింధు 10వ స్థానంలో నిలిచింది. రెండు నెలల క్రితం మరీ నాసిరకం ఆటతీరుతో 17వ స్థానానికి పడిపోయిన సింధు.. తిరిగి ర్యాంకింగ్ పాయింట్లు సాధించి టాప్-10లో చోటు దక్కించుకుంది.
ఇటీవల హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గడం ఖాయం అనుకున్న పీవీ సింధు పేలవ ఆటతీరుతో రిక్తహస్తాలతో వెనుదిరిగింది. దేశం తరఫున ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి మహిళగా రికార్డుల్లోకి ఎక్కిన సింధు.. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గి అనంతరం ఆ స్థాయి ఆటతీరు కనబర్చలేకపోతున్నది. గాయం కారణంగా లయ కోల్పోయిన ఈ తెలుగమ్మాయి.. కోర్టులో మునుపటి జోరు కనబర్చలేక ర్యాకింగ్స్లో వెనుకబడిపోయింది.
వచ్చే ఏడాది పారిస్ వేదికగా ఒలింపిక్స్ జరుగనున్న నేపథ్యంలో ర్యాంకింగ్ టోర్నీలలో పాల్గొనడం ద్వారా డైరెక్ట్ ఎంట్రీ సాధించాలనుకుంటున్న సింధు.. ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ఇటీవల డెన్మార్క్ ఓపెన్ సెమీఫైనల్ చేరిన సింధు.. కొరుకుడు పడని ప్రత్యర్థి కరోలినా మారిన్ చేతిలో పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ప్రపంచ మాజీ చాంపియన్ సింధు పూర్వ వైభవం సాధించి పారిస్ ఒలింపిక్స్‌లోనూ పతకం పట్టి హ్యాట్రిక్ సాధించాలని అభిమానులు ఆశిస్తుండగా.. ప్రస్తుతం ఈ తెలుగమ్మాయి ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొంటున్నది.