ముల్లాన్‌పూర్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా..కాపాడుకోలేక ఓటమివైపు నిలుస్తున్నది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో సన్‌రైజర్స్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో 223 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(33 బంతుల్లో 69 నాటౌట్, 5ఫోర్లు, 5సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీకి తోడు ఓపెనర్లు ప్రియాంశ్ (20 బంతుల్లో 57, 5ఫోర్లు, 5సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్‌సింగ్(25 బంతుల్లో 51, 4ఫోర్లు, 4సిక్స్‌లు) అర్ధసెంచరీలతో పంజాబ్ అలవోక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పసలేని రైజర్స్ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ పంజాబ్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్ దూకుడైన ఆటతీరుతో జట్టుకు మెరుగైన శుభారంభాన్ని అందించారు. శివాంగ్కుమార్(3/33) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. తొలుత అభిషేక్‌శర్మ(28 బంతుల్లో 74, 5ఫోర్లు, 8సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో హైదరాబాద్ నిర్ణీత 20ఓవర్లలో 219/6 స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లను ఉతికిఆరేస్తూ అభిషేక్ ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.
పంజాబ్ అలవోకగా..
లీగ్‌లో మంచి ఫామ్‌మీదున్న యువ ఓపెనర్ల ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్..హైదరాబాద్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలతో దుమ్మురేపారు. స్పిన్నర్ హర్ష్ దూబే తొలి ఓవర్లోనే పంజాబ్ విధ్వంస రచనకు తెరలేపింది. ఏకంగా 18 పరుగులతో తమ ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పింది. దూబేతో పాటు ఉనద్కత్, మలింగను పంజాబ్ ఓపెనర్లు గట్టిగా అరుసుకున్నారు. మలింగ తన ఓవర్లో 17 పరుగులు సమర్పించుకుంటే..హర్షల్‌ను లక్ష్యంగా చేసుకుంటూ ప్రియాంశ్ 6, 6, 4,4తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ క్రమంలో 16 బంతుల్లోనే ప్రియాంశ్ అర్ధసెంచరీ మార్క్ అందుకోగా, పంజాబ్ పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 93 పరుగులు చేసింది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను చైనామన్ స్పిన్నర్ శివాంగ్ కుమార్ దెబ్బకొట్టాడు. తొలుత ప్రియాంశ్ ఔట్ కాగా తొలి వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. 18 పరుగుల వ్యవధిలో ప్రభ్‌సిమ్రన్‌ను శివాంగ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన కూపర్ కనోలి(11) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. నేహాల్ వధేరా(14) నిరాశపరిచినా..అయ్యర్…శశాంక్(16 నాటౌట్)తో కలిసి గెలపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. 24 బంతుల్లో అయ్యర్ ఫిఫ్టి మార్క్ అందుకున్నాడు. మరో ఓవర్ మిగిలుండగానే పంజాబ్ గెలుపు వాకిట నిలిచింది.
అభిషేక్ ధనాధన్:
తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు అభిషేక్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా అభిషేక్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. పవర్‌ప్లే ముగిసే సరికి సన్‌రైజర్స్ 105 పరుగులు చేసింది.ఈ క్రమంలో 18 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్‌కు హెడ్ చక్కని సహకారం అందించాడు. వీరిద్దరు పోటాపోటీగా పరుగులు సాధించడంతో 8.1 ఓవర్లలో 120 పరుగులు చేసిన హైదరాబాద్‌ను శశాంక్సింగ్ దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో ఇద్దరిని ఔట్ చేసి పంజాబ్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత అదే దూకుడు కొనసాగించలేకపోయిన సన్‌రైజర్స్ 219 పరుగులకు పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 20 ఓవర్లలో(అభిషేక్ 74, క్లాసెన్ 39, శశాంక్ 2/20, అర్ష్‌దీప్ 2/50),
పంజాబ్: 18.5 ఓవర్లలో 223/4(అయ్యర్ 69 నాటౌట్, ప్రియాం శ్ 57, శివాంగ్ 3/33, దూబే 1/38).