ఐపీఎల్-17వ సీజన్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవబోతున్నది. జట్లన్నీ అస్త్రశస్ర్తాలతో సిద్ధమవుతున్నాయి. టైటిల్ గెలుపు లక్ష్యంగా ప్రణాళిలు రచిస్తున్నాయి. ఇప్పటి వరకు 16 సీజన్లు జరుగగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ ఐదేసి సార్లు ట్రోఫీని ఎగురేసుకుపోయాయి. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా చరిత్రకెక్కిన ముంబై, చెన్నైని నిలువరిస్తూ ఈసారి కొత్త విజేత పుట్టుకొచ్చే అవకాశం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందని ద్రాక్షగా ఇన్నేండ్ల నుంచి ఊరిస్తూ వస్తున్న ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకునేందుకు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. యువకులు, స్టార్ క్రికెటర్ల మేళవింపుతో సమవుజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్లు ఈసారైనా కప్ కల నెరవేర్చుకునేందుకు తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో జట్ల బలబలాలపై ప్రత్యేక కథనం.
పంజాబ్ కింగ్స్: పేరులో కింగ్స్ ఉన్నా..సీజన్ సీజన్‌కు పంజాబ్‌కు అదృష్టం కలిసి రావడం లేదు. స్టార్లు, యువకులతో కనిపిస్తున్నా..పంజాబ్ జట్టు నిలకడలేమి సమస్యతో సతమతమవుతున్నది. హార్డ్ హిట్టర్ శిఖర్ ధవన్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న పంజాబ్ ఈ సారైనా తమ పంజా పవర్ ఏంటో చూపించేందుకు తహతహలాడుతున్నది. సరిగ్గా పదేండ్ల క్రితం 2014లో చివరి సారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్..మళ్లీ టాప్-4లో నిలువలేకపోయింది. గత సీజన్లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్న ధవన్సేన.. ఈ సారి మెరుగైన ప్రదర్శన కోసం పోటీకి దిగుతున్నది. వేలంలో భారీగా ఖర్చు పెట్టిన కింగ్స్ యాజమాన్యం..క్రిస్ వోక్స్, హర్షల్ పటేల్, రిలీ రొసో, శశాంక్సింగ్, తనయ్ త్యాగరాజన్ లాంటి క్రికెటర్లను తీసుకుంది. వీరికి తోడు జానీ బెయిర్‌స్టో ఈ సీజన్‌కు పూర్తి అందుబాటులో ఉండటం పంజాబ్‌కు కలిసిరానుంది.
బలం: పంజాబ్‌కు ప్రస్తుతం బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నది. టాపార్డర్ బ్యాటర్లు శిఖర్ ధవన్, జానీ బెయిర్‌స్టో, రిలీ రోసోతో బందోబస్త్‌గా ఉంది. వీరికి తోడు మిడిల్లో లివింగ్‌స్టోన్, సికిందర్ రజా, సామ్ కరాన్ తమదైన రోజున మ్యాచ్‌ను ఒంటి చేత్తో మలుపు తిప్పడంలో సిద్ధహస్తులు. వికెట్‌కీపర్, బ్యాటర్ జితేశ్శర్మ ఇటీవలి ఫామ్ పంజాబ్‌కు అదనపు బలం.
బలహీనత: లీగ్‌లో స్పిన్నర్లదే హవా. అలాంటిది పంజాబ్‌కు రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ తప్ప నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం ఒకింత వెలితిగా కనిపిస్తున్నది. గత సీజన్లో వీరిద్దరు కలిసి 17 వికెట్లు పడగొట్టగా, ఈ సీజన్లో వీరి ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. లివింగ్‌స్టోన్, రజా రూపంలో పార్ట్‌టైమ్ స్పిన్నర్లు ఉన్నా..పంజాబ్‌కు స్టార్ స్పిన్నర్ల కొరత వేధిస్తున్నది.
ఢిల్లీ క్యాపిటల్స్: స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం ఢిల్లీకి కొండంత బలం చేకూర్చింది. అయితే అన్నీ ఉన్నా..అల్లుడి నోట్లో శని అన్నట్లు పేపర్ మీద బలంగా కనిపిస్తున్న ఢిల్లీ మైదానంలో ఆకట్టకోలేకపోతున్నది. హిట్టర్లతో దట్టంగా కనిపిస్తున్నా..అనుకున్న మేర ఫలితాలు అందుకోలేకపోతున్నది.
బలం: పంత్ రావడం ఢిల్లీకి కొత్త ఊపు తీసుకురాగా, అతని కెప్టెన్సీ జట్టుకు అదనపు బలం కానుంది. వార్నర్, హెట్‌మైర్, మిచెల్ మార్ష్, పృథ్వీషా లాంటి హార్డ్ హిటర్లు బ్యాట్లు ఝలిపిస్తే ఢిల్లీకి తిరుగుండకపోవచ్చు. వీరికి రికీ భుయ్, అభిషేక్ , హోప్, స్టబ్స్ జత కలిస్తే ఢిల్లీ ఢోకా లేనట్లే.
బలహీనత: కుటుంబ కారణాలతో హ్యారీ బ్రూక్ పూర్తిగా సీజన్‌కు దూరం కావడం ఢిల్లీకి ఒక రకంగా ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. పేసర్ ఎన్రిచ్ నోర్జె ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నాయి. ముకేశ్, ఖలీల్ రాణించడంపై ఢిల్లీ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.