ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫైనల్లోకి దూసుకెళ్లగా, మరో బెర్తు కోసం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ముఖాముఖి తలపడనున్నాయి. నేడు జరిగే క్వాలిఫయర్-2లో సత్తాచాటి ఆర్సీబీతో ఆఖరి పోరుకు ఇరు జట్లు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యాయి.ఆర్సీబీ చేతిలో భారీ ఓటమి ఎదుర్కొన్న పంజాబ్ ఓవైపు అయితే, గుజరాత్ టైటాన్స్‌ను నాకౌట్ చేసిన ముంబై ఇండియన్స్ మరోవైపు సై అంటే సై అంటున్నాయి. సుదీర్ఘ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు టైటిల్ గెలువని పంజాబ్..ఐదు సార్లు చాంపియన్ ముంబైని ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
అహ్మదాబాద్: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్-2 పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఇరు జట్ల కీలక పోరు జరుగనుంది. ఫైనల్ బెర్తు ఖరారు చేసే ఈ పోరులో ఎలాగైనా గెలిచి ఆర్సీబీతో తలపడేందుకు పంజాబ్, ముంబై తహతహలాడుతున్నాయి. లీగ్ దశలో పంజాబ్ టాప్‌లో నిలి స్తే..ఆదిలో వరుస ఓటములు ఎదుర్కొని అద్భుతంగా పుంజుకున్న ముంబై ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. ఒత్తిడిని అధిగమించడంలో తమకు తామే సాటి అని నిరూపిస్తూ ముంబై ముచ్చటగా ఆరోసారి ఐపీఎల్ టైటిల్‌ను దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు గత 17 సీజన్లుగా తమకు అందని ద్రాక్షగానే మిగిలిపోయిన టైటిల్‌ను ఈసారైనా ఒడిసిపట్టుకోవాలని అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ చూస్తున్నది.
పంజాబ్: లీగ్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న పంజాబ్ తమ సుదర్ఘీ కలను సాకారం చేసుకునేందుకు మరో అడుగు దూరంలో ఉంది. లీగ్ దశలో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ అద్భుత విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్..క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో భారీ ఓటమి ఎదుర్కొంది. దీన్నుంచి తేరుకుని ముంబైని నిలువరించాలన్న పట్టుదలతో ఉన్న కింగ్స్ తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా మట్టికరిపించడంలో ముందుంటుంది. అనుభవం లేకపోయినా అవకాశాలను అందిపుచ్చుకుంటూ యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్, శశాంక్, నేహాల్ వధేరా, అయ్యర్ పుంజుకుంటే ముంబైకి కష్టాలు తప్పకపోవచ్చు. గాయం నుంచి తేరుకున్న స్టార్ స్పిన్న ర్ చాహల్ చేరిక పంజాబ్‌కు లాభించేదే.
ముంబై: రికార్డు స్థాయిలో ఆరో టైటిల్‌పై కన్నేసిన ముంబై అందుకు తగ్గట్లు అడుగులు వేస్తున్నది. ఎలిమినేటర్‌లో గుజరాత్‌ను చిత్తుచేసిన ముంబై..పంజాబ్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నది. రోహిత్‌శర్మ, సూర్యకుమార్ సూపర్ ఫామ్మీదుండగా, తిలక్‌వర్మ, హార్దిక్, బెయిర్‌స్టో, నమన్‌తో బలంగా కనిపిస్తున్నది.