హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ గెలుపు జోరు కొనసాగుతున్నది. సోమవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పుణెరి 49-30 తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. పుణెరి జట్టులో ఆకాశ్ షిండే(11 పాయింట్లు) సూపర్-10తో మెరువగా, పంకజ్ మోహిత్(8), మోహిత్ గోయత్(5), అమన్(5), గౌరవ్ ఖత్రి(5) ఆకట్టుకున్నారు. గుజరాత్ జట్టులో గుమన్‌సింగ్(13) ఒంటరిపోరాటం గెలిపించలేకపోయింది. ఇప్పటి వరకు పుణెరి ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింటిలో గెలువగా, గుజరాత్ ఐదింటిలో నాల్గో ఓటమి ఎదుర్కొంది.
మ్యాచ్ విషయానికొస్తే..వరుస విజయాల దూకుడు మీదున్న పుణెరి పల్టాన్ ఆది నుంచే గుజరాత్‌పై విరుచుకుపడింది. ప్రథమార్ధంలోనే పల్టాన్ 21 పాయింట్ల ఆధిక్యం కనబరిచింది. కెప్టెన్ అస్లాం ఇనామ్దార్ బరిలో లేకపోయినా.. ఆకాశ్ షిండే, పంకజ్ మోహిత్, మోహిత్ గోయత్ రైడింగ్‌లో కేక పుట్టించారు. మరో పోరులో బెంగళూరు బుల్స్ 36-32తో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడిన బెంగళూరు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బెంగళూరు జట్టులో అజింక్యా పవార్ (6), అక్షిత్ (6), సురిందర్ పహల్ (5) రాణించారు.