న్యూఢిల్లీ (నమస్తే, తెలంగాణ): దేశ ప్రధాని బేటీ బచావో… బేటీ పఢావో అంటే ఇదేనా? అంతర్జాతీయంగా ఆటల్లో దేశానికి వన్నెతెచ్చిన ఆడ బిడ్డలకిచ్చే గౌరవం, న్యాయం ఇదేనా అని పలువురు రెజ్లర్లు ప్రశ్నిస్తున్నారు. ఒలింపిక్ మెడల్ గ్రహీత భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ పోగట్‌లు విలేకరులతో మాట్లాడుతూ, గతంలో తమను కొందరు తప్పుదోవ పట్టించారని, కానీ ఈసారి అలా జరగదన్నారు. రాజకీయ బలం కూడా కావాలని, అందుకే తమ నిరసన ప్రదర్శనకు అన్ని పార్టీలు, దేశవ్యాప్తంగా క్రీడా సంఘాలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఎంపీ బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని చెబుతున్నా కనీసం ఎందుకు విచారణ చేపట్టడం లేదో? అర్థం కావడం లేదన్నారు. వేధింపుల విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పేర్కొన్నారు. కేంద్ర క్రీడామంత్రి వేసిన విచారణ కమిటీ సమర్పించిన నివేదికను ఎందుకు బయపెట్టడం లేదని ప్రశ్నించారు. వెంటనే బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని, మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని కోరారు. వీరి ధర్నాకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ హాజరై మద్దతు పలికారు. ఐద్యా మహిళ సంఘం నాయకులు కూడా ప్రదర్శనలో పాల్గొని మహిళా రెజ్లర్లకు అండగా నిలిచారు.
ఇది ప్రతిఒక్కరూ సిగ్గుపడాల్సిన విషయం. ఆటగాళ్లు..ఏవిషయంలోనైతే ఆరోపణలు చేస్తున్నారో దానిపై సర్కారు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం విడ్డూరం. కేంద్ర మంత్రి విచారణ చేపడుతున్నామనడం తప్ప ఏమీ లేదు. దేశం కోసం మెడల్స్ తెచ్చిన వారికి చాలా అవమానం జరుగుతున్నది. ఆయన బీజేపీకి చెందిన ఎంపీ కావడంవల్లే మోదీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మహిళా రెజర్లకు ఆప్ అండగా నిలుస్తుంది.
– సుశీల్,ఆప్ ఎంపీ రాజ్యసభ సభ్యుడు
మహిళా రెజ్లర్ల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు. తనను లైంగికంగా వేధించారని మహిళ ఫిర్యాదు చేస్తే ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టాలి. సుప్రీంకోర్టు నిబంధనలు కూడా అదే చెబుతున్నాయి. ఒలింపిక్స్ లో ఇండియాకు పేరుతెచ్చి పెట్టిన మహిళా రెజ్లర్ల పట్ల కేంద్రం తీరు సరైంది కాదు.
– జ్ఞాన్‌సింగ్, జాతీయ రెజ్లర్ల కోచ్.