IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) మళ్లీ గెలుపు బాట పట్టింది. ముల్లనూర్ మైదానంలో ప్రియాన్ష్ ఆర్య(103) మెరుపు సెంచరీతో భారీ స్కోర్ చేసిన పంజాబ్.. మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 201కే కట్టడి చేసింది. ఈ సీజన్లో 190 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించని సీఎస్కే మళ్లీ విఫలమైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే(69 రిటైర్డ్ హర్ట్), ఇంప్యాక్ట్ ప్లేయర్ శివం దూబే(42) పోరాడారు. ఆఖర్లో ఎంఎస్ ధోనీ(22) ధనాధన్ ఆడినా ఓటమి తప్పించలేకపోయాడు. బౌలింగ్‌లో భారీగా పరుగులిచ్చిన చెన్నై.. బ్యాటింగ్‌లో ఉతికారేయలేక వరుసగా మూడో ఓటమి మూటగట్టుకుంది.
సొంత ఇలాకాలో పంజాబ్ కింగ్స్ పంజా విసిరింది. రాజస్థాన్ చేతిలో ఓటమి నుంచి తేరుకున్న పంజాబ్ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించి.. మ్యాచ్‌ను సొంతం చేసుకుంది ప్రియాన్స్ ఆర్య() విధ్వంసక శతకం.. శశాంక్ సింగ్(54 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్‌కు 220 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఛేదనలో ఓపెనర్ రచిన్ రవీంద్ర(36) ధాటిగా ఆడాడు.
కానీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(1) ఫెర్గూసన్ బౌలింగ్‌లో సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 62 వద్ద రెండో వికెట్ పడడంతో.. ఇంప్యాక్ట్ ప్లేయర్ శివం దూబే(42) ఓపెనర్ డెవాన్ కాన్వే(69 రిటైర్డ్ హర్ట్)లు మూడో వికెట్‌కు 90 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. దూబేను బౌల్డ్ చేసిన ఫెర్గూసన్ చెన్నైకి షాకిచ్చాడు. ఎంఎస్ ధోనీ(22), 19వ ఓవర్లో 4, 6 బాదడంతో సీఎస్కే స్కోర్ 190 దాటింది. యశ్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్ తొలి బంతికే ధోనీ ఔటయ్యాడు. ఆఖరి ఓవర్లో 9 రన్స్ మాత్రమే రావడంతో చెన్నై జట్టు విజయానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
సొంతమైదానంలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(103) విధ్వంసక సెంచరీ సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ 39 బంతుల్లోనే శతకంతో గర్జించాడీ హిట్టర్. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సర్లతో సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించాడీ యంగ్‌స్టర్. పవర్ ప్లేలోపే 3 కీలక వికెట్లు పడిన పంజాబ్‌ను ఆదుకున్న ప్రియాన్ష్.. 19 బంతుల్లోనే ఐపీఎల్లో తొలి అర్ధ శతకం బాదాడు.
ఆ తర్వాత శశాంక్ సింగ్(54 నాటౌట్)జతగా కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. మరో 20 బంతుల్లోనే సెంచరీకి చేరువైన ప్రియాన్ష్ ఈ మెగా టోర్నీలో అత్యంత వేగవంతమైన వంద బాదిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇక డెత్ ఓవర్లలో మార్కో యాన్సెస్(34 నాటౌట్) సైతం బ్యాట్ ఝులిపించడంతో పంజాబ్ స్కోర్ 19 ఓవర్‌కే రెండొందలు దాటింది. పథిరన వేసిన ఆఖరి ఓవర్లో శశాంక్ ఒక సిక్సర్ బాదగా.. చివరి బంతికి 3 రన్స్ తీశారు. దాంతో పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 219 రన్స్ కొట్టింది.