హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశంలోనే మూడో అతిపెద్ద స్పోర్ట్స్ లీగ్ అయిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో ఫ్రాంచైజీ కల్గిఉన్న హైదరాబాద్ బ్లాక్ హాక్స్ (హెచ్బీహెచ్).. వర్సిటీ స్పోర్ట్స్ సంస్థతో కలిసి స్కూల్ వాలీబాల్ లీగ్‌కు శ్రీకారం చుట్టింది. పాఠశాల స్థాయిలో క్రీడాకారులకు వాలీబాల్ ఆడేందుకు ఒక వేదికను కల్పించడంతో పాటు ఈ క్రీడవైపు పిల్లలను ఆకర్షితులను చేయడానికి ఈ లీగ్ ఉపయోగపడుతుందని పీవీఎల్-హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి సెప్టెంబర్ 28 వరకు హైదరాబాద్ వేదికగా ఈ లీగ్ జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 32 బాలుర, 19 బాలిక జట్లు పాల్గొననున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి ప్రొఫెషనల్ విధానంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని అభిషేక్ వెల్లడించారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్, బైస్కిల్ కైజెన్, సిక్స్5సిక్స్ సంస్థలు ఈ లీగ్ నిర్వహణకు సహకారం అందిస్తున్నాయని హెచ్బీహెచ్ స్పోర్ట్స్ డైరెక్టర్ సంజయ్ తెలిపారు.