హార్సెన్స్ (డెన్మార్క్) : ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ థామస్, ఊబర్ కప్‌లకు వేళైంది. డెన్మార్క్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ శుక్రవారం నుంచి మొదలుకానుంది. 2022 లో థామస్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆ విజయాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉండగా ఊబర్ కప్‌లో అమ్మాయిలు ఏ మేరకు సత్తాచాటుతారనేది ఆసక్తికరం. థామస్ కప్ 2024 ఎడిషన్‌లో క్వార్టర్స్ చేరిన భారత్.. చైనా చేతిలో ఓడింది. గ్రూప్ ‘ఏ’లో కెనడా, ఆస్ట్రేలియా, చైనాతో తలపడనున్న భారత్.. నేడు కెనడాతో జరుగబోయే మ్యాచ్‌తో టోర్నీని ఆరంభించనుంది. సింగిల్స్ విభాగాల్లో 2022 విజయంలో కీలకంగా వ్యవహరించిన హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, శ్రీకాంత్‌తో పాటు యువ సంచలనం ఆయుష్ శెట్టి బరిలో ఉన్నారు.
డబుల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ సాత్విక్, చిరాగ్ ద్వయం గాయంతో కోలుకుని బరిలోకి దిగుతుంది. ఎంఆర్ అర్జున్, హరిహరన్ సైతం బ్యాకప్‌గా ఉన్నారు. నేడు కెనడా మ్యాచ్‌తో థామస్ కప్ వేటను ఆరంభించనున్న భారత్.. 28న ఆస్ట్రేలియాతో 30న చైనాతో ఆడుతుంది. ఇక ఊబర్ కప్‌లో భాగంగా గ్రూప్-ఏలో ఆతిథ్య డెన్మార్క్, ఉక్రెయిన్, చైనాతో భారత్ తలపడుతుంది. మిగిలిన మ్యాచ్‌లతో పోలిస్తే చైనాతో పోరు భారత అమ్మాయిలకు కఠిన పరీక్షే. డబుల్ ఒలింపిక్ విజేత పీవీ సింధు, యువ షట్లర్లు ఉన్నతి, తన్వి, దేవికా, ఇష్రాణి సింగిల్స్ విభాగాల్లో భారత టైటిల్ ఆశలు మోస్తుండగా డబుల్స్‌లో తనీషా.. సిమ్రన్, కవిప్రియ ద్వయానికి తోడు శృతి, ప్రియా జంట బరిలో ఉంది. ఊబర్ కప్‌లో భారత్.. నేడు డెన్మార్క్‌తో ఆడుతుంది.