పారిస్: పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్ల పతకాల జోరు కొనసాగుతోంది. శారీరక వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడిస్తున్న మన క్రీడాకారుల ప్రదర్శనతో పతకాల పట్టికలో భారత్ టాప్-10 దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రీడలలో ఇప్పటికే దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేసి 25 పతకాలు సాధించిన దేశానికి శుక్రవారం మరో స్వర్ణం దక్కింది.
పురుషుల హైజంప్ (టీ64)లో యువ పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్.. రికార్డు స్థాయిలో 2.08 మీటర్ల (ఆసియా రికార్డు) ఎత్తుకు దూకి పసిడి దక్కించుకున్నాడు. 21 ఏండ్ల వయసులోనే రెండో పారాలింపిక్స్ ఆడుతున్న అతడు టోక్యోలో రజతం నెగ్గగా పారిస్‌లో దాని రంగు మార్చడం విశేషం. హైజంప్‌లో భారత్‌కు ఇది మూడో పతకం. దీంతో పతకాల పట్టికలో భారత్ తన స్థానాన్ని మరింత (14) మెరుగుపరుచుకుంది.
పురుషుల హైజంప్ (టీ64)లో ప్రవీణ్‌కుమార్ పసిడి సాధించాడు. ఆరుగురు అథ్లెట్లు పోటీపడ్డ ఫైనల్లో ఈ నోయిడా కుర్రాడు.. 2.08 మీటర్ల ఎత్తుకు దూకి మొదటి స్థానంలో నిలిచాడు. యూఎస్ఏ అథ్లెట్ డెరెక్ లొక్సిడెంట్ (2.06 మీటర్లు), ఉక్రెయిన్‌కు చెందిన టెముర్బెక్ జియాజొవ్ (2.03 మీటర్లు) వరుసగా రజత, కాంస్యాలు గెలిచారు. 1.89 మీటర్ల ఎత్తు నుంచి స్వర్ణ పతక రేసు మొదలుపెట్టిన ప్రవీణ్.. 2.08 మీటర్లతో గోల్డ్ మెడల్ కొట్టాడు. ఈ పతకంతో ప్రవీణ్ 21 ఏండ్ల వయసులోనే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా తంగవేలు మరియప్పన్, శరద్ కుమార్ తర్వాత భారత్‌కు హైజంప్‌లో ఇది మూడో పతకం.
టీ64 కేటగిరీ అంటే ఒక అథ్లెట్ కాలు ఒకటి చిన్నగా లేదా రెండు కాళ్లు మోకాళ్ల కింది భాగంలో సక్రమంగా లేకపోవడం. ప్రవీణ్ పుట్టినప్పుడే ఎడమ కాలు చిన్నగా ఉంది. వయసు పెరుగుతున్న క్రమంలో అతడు తన వైకల్యం కారణంగా ఆత్మనూన్యత భావానికి గురయ్యాడు. ఆ బాధల నుంచి బయటపడటానికి గాను క్రీడల వైపునకు మళ్లాడు. చిన్నప్పుడు వాలీబాల్ బాగా ఆడే ప్రవీణ్‌లోని ప్రతిభను గమనించిన పారా అథ్లెట్ కోచ్ జి. సత్యపాల్ సింగ్ అతడిని హైజంప్ వైపునకు ప్రోత్సహించాడు. ఇక ఆ తర్వాత నుంచి అతడి కెరీర్ కీలక మలుపు తీసుకుంది. 18 ఏండ్ల వయసులోనే టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న ప్రవీణ్.. ఆ టోర్నీలో రజతం గెలిచాడు.
కనోయింగ్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు సెమీస్‌కు అర్హత సాధించారు. మహిళల వీఎల్2 200 మీటర్ల హీట్‌లో ప్రాచి యాదవ్, పురుషుల కెఎల్1 200 మీటర్ల హీట్‌లో యశ్ కుమార్ 4, 6 స్థానాలు సాధించి సెమీస్‌కు దూసుకెళ్లారు. శనివారం సెమీస్ పోటీలు జరుగుతాయి. మహిళల పవర్ లిఫ్టింగ్ 67 కిలోల విభాగంలో కె. రాజమణి 106 కిలోలు ఎత్తి 8వ స్థానంలో నిలిచింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్54 ఈవెంట్లో దీపేశ్ కుమార్ 26.11 మీటర్లతో చివరి స్థానంలో నిలిచాడు. మహిళల 200మీ.ల టీ12 రేసులో భారత అథ్లెట్ సిమ్రాన్ శర్మ 25.03 సెకన్ల టైమింగ్‌తో తుది పోరుకు అర్హత సాధించింది.
పారిస్ పారాలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఆర్చర్ హర్విందర్‌సింగ్, యువ అథ్లెట్ ప్రీతిపాల్ జాతీయ పతాకధారులుగా వ్యవహరించనున్నారు. ఆదివారం జరిగే కార్యక్రమంలో వీరిద్దరు జాతీయ జెండా చేతపట్టుకుని మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటారు. పారాలింపిక్స్‌లో తొలి పసిడి పతకంతో హర్విందర్ కొత్త చరిత్ర లిఖించగా, ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన అథ్లెట్‌గా ప్రీతి రికార్డుల్లోకెక్కింది.