ఖైరతాబాద్, నవంబర్ 7: చెస్ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణకు చెందిన క్రీడాకారిణి ప్రతిభ తక్కడపల్లి సత్తా చాటారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోటీలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గత నెల 28 నుంచి ఈనెల 3వ తేదీ వరకు ఇటలీలోని రిచోనిలో జరిగిన అంతర్జాతీయ చెస్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించినట్లు తెలిపారు.
భారతదేశం తరఫున ఈ పోటీల్లో తొమ్మిది మంది పాల్గొంటే తెలంగాణ నుంచి ఏకైక క్రీడాకారిణిగా తాను వెళ్లానని తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన తాను పటియాలలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో బాక్సింగ్ నేర్చుకున్నానని, ప్రస్తుతం మొదటి మహిళా బాక్సింగ్ కోచ్‌గా పని చేస్తున్నానని తెలిపారు.
ఇప్పటికే కిక్ బాక్సింగ్, థాయ్ బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో వరుసగా బంగారు పతకాలు సాధించానన్నారు. తనకు శ్రీవేంకటేశ్వర కళాశాల చైర్మన్, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మనుమరాలు అజితా సురభీ సహకారం అందించారన్నారు. త్వరలోనే దేశంలో జరుగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొననున్నానని, ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందించాలని ఆమె కోరారు.