ఓస్లో: ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సంచలన ప్రదర్శనతో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌కు మరోసారి షాకిచ్చాడు. మంగళవారం రాత్రి హోరాహోరీగా సాగిన ఎనిమిదో రౌండ్ క్లాసికల్ గేమ్‌లో నల్ల పావులతో బరిలోకి దిగిన ప్రజ్ఞానంద తన ఎత్తులతో అదరగొట్టాడు. ఎండ్గేమ్లో మాగ్నస్‌పై నిరంతరం ఒత్తిడి పెంచి అతడు లొంగిపోయేలా చేశాడు. ఈ విజయంతో ఈ ఏడాది క్లాసికల్ గేమ్స్‌లో కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన ఏకైక ఆటగాడిగా 20 ఏండ్ల ప్రజ్ఞానంద అరుదైన రికార్డు సృష్టించాడు. దాంతోపాటు 12 పాయింట్లతో టోర్నీ పట్టికలో మూడో స్థానానికి చేరుకుని టైటిల్ రేసులో నిలిచాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్ డి. గుకేశ్‌కు ఈ రౌండ్లో నిరాశే ఎదురైంది. ఫ్రాన్స్జీఎం అలీరెజా ఫిరౌజా చేతిలో పరాజయం పాలవడంతో గుకేశ్ టైటిల్ ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. ప్రస్తుతం 8 పాయింట్లతో గుకేశ్ టోర్నీ పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోగా, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ కూడా 9 పాయింట్లతో వెనుకబడటంతో తన టైటిల్ ఆశలు దాదాపు ముగిశాయి. ఇక మహిళల విభాగంలో భారత క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ కజకిస్తాన్‌కు చెందిన బిబిసార అసౌబయేవా చేతిలో ఓడిపోగా, కోనేరు హంపి.. అనా ముజిచుక్‌తో ఆర్మగెడాన్ టై-బ్రేక్ ఓడిపోయింది.