Dacoit | వైవిధ్యమైన కథలు, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టాలీవుడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. సస్పెన్స్, యాక్షన్, భావోద్వేగాల కలయికగా రూపొందిన ఈ సినిమా టీవీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డెకాయిట్’ చిత్రం జూలై 19, ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. ఆదివారం ప్రైమ్ టైమ్ స్లాట్‌లో ఈ సినిమాను టెలికాస్ట్ చేయనున్న నేపథ్యంలో మంచి టీఆర్పీ సాధించే అవకాశాలు ఉన్నాయని బుల్లితెర వర్గాలు భావిస్తున్నాయి.
‘డెకాయిట్’ ఒక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, దొంగతనం వంటి అంశాల చుట్టూ కథ సాగుతుంది. అడివి శేష్ గత చిత్రాలైన క్షణం, గూఢచారి, మేజర్ తరహాలో కాకుండా ఈసారి మరింత రా అండ్ ఇంటెన్స్ పాత్రలో కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి శనీల్ డియో దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఇది ఆయన తొలి సినిమా అయినప్పటికీ, సినిమాటోగ్రాఫర్‌గా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్నారు. అడివి శేష్ కెరీర్లో కీలకమైన ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఆయన సినిమాటోగ్రఫీ అందించారు. విజువల్స్, కలర్ గ్రేడింగ్, యాక్షన్ ఎలిమెంట్స్‌ను స్టైలిష్‌గా తెరకెక్కించి సినిమాకు ప్రత్యేకమైన లుక్ తీసుకొచ్చారు.
సీతారామం, హాయ్ నాన్న చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అడివి శేష్‌తో ఆమె కెమిస్ట్రీ, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సెంటిమెంట్, లవ్ ట్రాక్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా మారాయి. థియేటర్లలో క్లాస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన ‘డెకాయిట్’ ఇప్పుడు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. సస్పెన్స్‌తో కూడిన కథనం, స్టైలిష్ మేకింగ్, అడివి శేష్-మృణాల్ ఠాకూర్ నటన ఈ చిత్రాన్ని బుల్లితెరపై కూడా విజయవంతం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.