Sandeep Reddy Vanga | టాలీవుడ్లో కంటెంట్ ఆధారిత చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా, నటుడు సత్యదేవ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘రావు బహదూర్’ సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొల్పింది. కేరాఫ్ కంచరపాలెం తర్వాత వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం కావడంతో సినీ అభిమానుల దృష్టి దీనిపై పడింది.థియేటర్లలో విడుదలైన తర్వాత ‘రావు బహదూర్’కు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, సినిమా తీసుకున్న కథనం, భావోద్వేగాలు, నటీనటుల ప్రదర్శనలకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని వీక్షించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
‘రావు బహదూర్’ చూసిన అనంతరం సందీప్ రెడ్డి వంగ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమా నిజమైన సినిమా ప్రేమికులు తప్పక చూడాల్సిన అరుదైన చిత్రాల్లో ఒకటని ఆయన కొనియాడారు.ఇది ఒక అరుదైన సినిమా. మనం సినిమాను ఎందుకు ప్రేమిస్తామో గుర్తు చేసే గొప్ప చిత్రాల్లో ఇది ఒకటి. ప్రతి సినిమా ప్రేమికుడు తన జీవితంలో మూడు గంటల సమయాన్ని ఈ చిత్రానికి కేటాయించాలి. మీ సమయం, మీ శ్రద్ధ, మీ చప్పట్లకు ఈ సినిమా పూర్తిగా అర్హమైనదిఅని సందీప్ పేర్కొన్నారు.దర్శకుడు వెంకటేష్ మహా పరిమిత బడ్జెట్లోనూ ఎంతో అందమైన, ఆలోచింపజేసే చిత్రాన్ని తెరకెక్కించారని సందీప్ రెడ్డి వంగ ప్రశంసించారు.
ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ఇంత గొప్ప సినిమాను రూపొందించడం అంత సులభం కాదు. అలాంటి సినిమా చేయడానికి ధైర్యం, కథపై నమ్మకం అవసరం. వెంకటేష్ మహా ఆ నమ్మకాన్ని తెరపై అద్భుతంగా చూపించారు అని ఆయన అన్నారు.సినిమాలో హీరో సత్యదేవ్ నటనను కూడా సందీప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సత్యదేవ్ అద్భుతంగా నటించారు. ఎలాంటి అనవసర ఆర్భాటాలు లేకుండా, షార్ట్కట్లు ఆశ్రయించకుండా, స్వచ్ఛమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇలాంటి సినిమాలు మరింత ఆదరణ పొందాలి అంటూ ఆయన కొనియాడారు. సందీప్ రెడ్డి వంగ వంటి స్టార్ దర్శకుడు తన సినిమాపై ఇంత గొప్ప ప్రశంసలు కురిపించడంతో దర్శకుడు వెంకటేష్ మహా ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, సందీప్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన సినిమాను అర్థం చేసుకుని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.