Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఇరాన్ (Iran) పై కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని ‘పిక్‌యాక్స్ మౌంటెన్ అణు కేంద్రం (Pickaxe nuclear site)’ అమెరికా లక్ష్యాల జాబితా (US targets list) లోనే ఉన్నదని చెప్పారు. ఆ అణు కేంద్రాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించారు. అవసరమైతే త్వరలోనే అక్కడ కూడా దాడి జరిగే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.
స్పేస్ ఫోర్స్‌తోపాటు ఇతర వ్యవస్థల ద్వారా ఆ కేంద్రంపై నిరంతరం నిఘా కొనసాగుతోందని ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి కదలికలు కనిపించడం లేదని చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన సమాచారం వచ్చినప్పుడల్లా దాన్ని అడ్డుకుంటున్నామని తెలిపారు. ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖరారయ్యే దశలో ఆ దేశమే వెనక్కి తగ్గిందని ట్రంప్ ఆరోపించారు. ఒప్పందాలను ఉల్లంఘించడం ఇరాన్‌కు అలవాటేనని విమర్శించారు.
ఇరాన్ నాయకత్వంపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి చేతికి అణ్వాయుధం దక్కితే దాన్ని వినియోగించడానికి ఏమాత్రం వెనుకాడరని ఆరోపించారు. అయితే ఆ దేశ నాయకులపై తీసుకునే చర్యల గురించి మాత్రం మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. వైట్‌హౌస్‌లో జరిగిన మరో కార్యక్రమంలో కూడా ట్రంప్ ఇదే అంశంపై స్పందించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్‌కు అణ్వాయుధం దక్కనివ్వబోమని స్పష్టంచేశారు.
మరోవైపు చర్చలకు తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని, ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఇంకా ఉందని ట్రంప్ చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునే విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన మరోసారి స్పష్టంచేశారు.