Cristiano Ronaldo | హంబర్గ్: పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కల చెదిరింది. కెరీర్ చరమాంకంలో ఉన్న రొనాల్డో యూరో కప్ టైటిల్ ఆశలు ఆవిరయ్యాయి. ఈసారైనా కప్‌ను ముద్దాడుదామనుకున్న పోర్చుగల్ ఆశలపై ఫ్రాన్స్ నీళ్లు గుమ్మరించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన యూరో కప్ క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ 5-3 తేడా(పెనాల్టీ షూటౌట్)తో పోర్చుగల్‌పై విజయం సాధించింది.
తద్వారా యూరో కప్ నుంచి రొనాల్డో భారంగా నిష్క్రమించాడు. నిర్ణీత సమయానికి తోడు ఎక్స్ట్రా టైమ్‌లోనూ ఇరు జట్లు గోల్ ఖాతా తెరువకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు జరిగిన పెనాల్టీ షూటౌట్లో ఫ్రాన్స్ పైచేయి సాధించింది. ఫ్రాన్స్ తరఫున డెంబ్లె, ఫొఫోనా, జులెస్, బ్రాడ్లీ, హెర్నాండెజ్ గోల్స్ చేయగా, పోర్చుగల్‌కు రొనాల్డో, బెర్నాండో, మెండెస్ గోల్స్ అందించారు. తనకు వచ్చిన అవకాశాన్ని పోర్చుగల్ ప్లేయర్ జావో ఫెలిక్స్ చేజార్చుకున్నాడు.