మ్యూనిచ్: యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ చాంపియన్‌షిప్‌లో పోర్చుగల్ టైటిల్ విజేతగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో పోర్చుగల్ 5-3(పెనాల్టీ షూటౌట్)తో స్పెయిన్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. 2004 యూరో కప్‌లో స్పెయిన్‌ను ఓడించిన పోర్చుగల్ ఇన్నేండ్ల తర్వాత మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. రెండోసారి నేషన్స్ లీగ్ టైటిల్ సొంతం చేసుకున్న పోర్చుగల్‌కు స్టార్ ైస్ట్రెకర్ క్రిస్టియానో రొనాల్డో కీలకంగా నిలిచాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో పోర్చుగల్ తరఫున నూనో మెండెస్(26ని), రొనాల్డో(61ని) గోల్స్ అందించగా, మార్టిన్ జుబిమెండి(21ని), మికెల్ ఒయర్జబాల్(45ని) స్పెయిన్‌కు గోల్స్ చేశారు. ఆది నుంచే ఇరు జట్లు గోల్స్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ మొదలైన 21నిమిషానికి మార్టిన్ చేసిన గోల్‌తో స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే స్పెయిన్ సంబరం ఎక్కువసేపు నిలువలేదు. ఐదు నిమిషాల వ్యవధిలో మెండెస్ గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది.
అయితే మ్యాచ్ ప్రథమార్ధం ముగుస్తుందన్న తరుణంలో పోర్చుగల్ డిఫెన్స్‌ను ఏమారుస్తూ మికెల్ చేసిన గోల్‌తో స్పెయిన్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోరు సమం చేసేందుకు పోర్చుగల్ చేసిన ప్రయత్నాలు 61వ నిమిషంలో రొనాల్డో గోల్‌తో సాధ్యమయ్యాయి. తనదైన శైలిలో రొనాల్డో గోల్ చేయడంతో స్కోరు 2-2తో సమమైంది. చివరి వరకు ఇరు జట్లు నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయంలోనూ చేసిన గోల్ ప్రయత్నాలు నెరవేరలేదు. దీంతో విజేతను నిర్ణయించేందుకు అనివార్యమైన పెనాల్టీ షూటౌట్లో పోర్చుగల్ 5-3తో స్పెయిన్‌ను ఓడించింది. పోర్చుగల్ తరఫున రుబెన్ నెవిస్, నూనో మెండిస్, బ్రూనో ఫెర్నాండెజ్, వితిన్హా , గొంకాలో రామోస్ గోల్స్ చేశారు. కెరీర్లో 138వ అంతర్జాతీయ గోల్ ఖాతాలో వేసుకున్న రొనాల్డో మ్యాచ్ ముగిసిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీటిని నియంత్రించుకుంటూ సహచరులతో కలిసి విజయాన్ని ఆస్వాదించాడు.