హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఓపెన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పోలీస్ జట్టు పతకాల పంట పండించింది. సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా జరిగిన ఈ పోటీల్లో పోలీస్ టీమ్ 11 మెడల్స్ (4 స్వర్ణ, 6 రజత, 1 కాంస్య) సాధించింది. విజేతలను డీజీపీ అంజనీకుమార్ సోమవారం తన కార్యాలయంలో అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వర్తించే పోలీసులు క్రీడల్లో రాణించడం సంతోషంగా ఉందన్నారు. రాచకొండ ఐటీ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమార్ (25 మీటర్ల ఫైర్ పిస్టల్), సీఎస్‌డబ్ల్యూ సీఐ శంకర్ (25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్), జగిత్యాల ఆర్ఐ సైదులు (10 మీటర్ల ఎయిర్ పిస్టల్), కామారెడ్డి కానిస్టేబుల్ రాజ్‌కుమార్ (50 మీటర్ల ఎయిర్ రైఫిల్) ఈ ఈవెంట్లో పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు.