IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ రంజుగా సాగుతోంది. ఉత్కంఠ పోరాటాలు, ఆఖరి ఓవర్ థ్రిల్లర్స్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. అయితే.. అందరిలానే ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఓ అభిమానికి మాత్రం ఊహించని అనుభవం ఎదురైంది. అభిమాన క్రికెటర్ల ఆట చూసి మురిసిపోవాలనుకున్న అతడు ఏకంగా ఆస్పత్రి పాలయ్యాడు. దాంతో, కర్నాటక క్రికెట్ అసోసియేషన్(Karnataka State Cricket Association)పై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే..
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మే 12న మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌కు చైతన్య(Chaitanya) అనే యువకుడు తన స్నేహితుడు గౌతమ్‌తో కలిసి వెళ్లాడు. మ్యాచ్ మధ్యలో అక్కడి ఖతర్ ఎయిర్వేస్ ఫ్యాన్స్ స్టాండ్(Qatar Airways Fans Stand)లోని క్యాంటీన్లో గులాబ్ జామ్, పెరుగన్నం, ఇతరత్రా తిన్నాడు. ఆ కాసేపటికే చైతన్యకు కడుపు నొప్పి మొదలైంది.
అంతేకాదు స్టేడియంలో కూర్చున్నచోటనే చైతన్య ఉన్నట్టుండి కిందపడిపోయాడు. దాంతో, అప్రమత్తమైన మైదానంలోని సిబ్బంది అతడికి వెంటనే ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత చైతన్య ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. అక్కడి డాక్టర్లు చైతన్యను ఫుడ్ పాయిజనింగ్ అయిందని తేల్చారు. క్యాంటీన్లో పాచి పట్టిన ఆహారపదార్ధాలు సర్వ్ చేశారని, అందుకే చైతన్యకు కడుపు నొప్పి వచ్చిందని పోలీసులకు వివరించారు. డాక్టర్ల వాంగ్మూలంతో కబ్బన్ పార్క్ పోలీసులు (Cubbon Park Police) కర్నాటక క్రికెట్ సంఘంతో పాటు ఆ క్యాంటీన్ యజామానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.