హైదరాబాద్ : ఐపీఎల్ ప్లేఆఫ్స్ (Playoffs) మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ(Virat Kohli )బ్యాటింగ్ రికార్డులు ఆర్సీబీ అభిమా నులను, విశ్లేషకులను కలవరపెడుతున్నాయి. లీగ్ దశలో నిలకడగా రాణించే కోహ్లీ.. ప్లేఆఫ్స్ ఒత్తిడిలో మాత్రం తీవ్రంగా తడబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 14 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలు, 18 పాయింట్లు, +0.78 ఆకట్టుకునే నెట్ రన్ రేట్‌తో, ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఈ క్రమంలో మంగళవారం ధర్మశాలలో జరిగే ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్నందున అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది.
విరాట్ కోహ్లీ ఈ సీజన్లో 14 మ్యాచ్‌లలో 557 పరుగులు సాధించాడు. ఈ నెల ఆరంభంలో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌లో 58 పరుగులు చేశాడు. ఫైనల్‌కు చేరడానికి ఆర్సీబీకి రెండు అవకాశాలు లభిస్తుండగా ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు డిఫెండింగ్ ఛాంపియన్స్‌కు కోహ్లీ ఫామ్ కీలకంగా మారనుంది. అయితే 17 ప్లేఆఫ్ మ్యాచ్‌లలో కోహ్లీ 26.40 సగటుతో, 121.10 స్ట్రైక్ రేట్‌తో 396 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటికైనా ప్లేఆఫ్స్‌లో కోహ్లీ పరుగుల వరద పారించాలని ఆర్సీబీ జట్టు కోరుకుంటోంది.
ఇదిలా ఉండగా మంగళవారం హెచ్పీసీఏ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే కీలక పోరులో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఆర్సీబీ ఆత్మవిశ్వాసంతో క్వాలిఫయర్- 1లోకి అడుగుపెట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌కు నేరుగా చేరుకుంటుంది. ఓడిన జట్టు టైటిల్ పోరుకు చేరుకోవడానికి మరో అవకాశం ఉంటుంది.
కాగా, మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ, జీటీ జట్లలో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉందన్నారు. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్, హేజిల్‌వుడ్ వికెట్లు తీయలేకపోవడం వల్లే ఓడిపోయారు. దానిని మర్చిపోయి ముందుకు వెళ్లాలన్నారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆర్సీబీ చెమటోడ్చాలని సూచించారు.