అహ్మదాబాద్: టెస్ట్ క్రికెట్లో వెలుతురు లేమి (బ్యాడ్ లైట్) కారణంగా ఆట నిలిచిపోయే సమస్యకు చెక్ పెట్టేందుకు ఐసీసీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ మధ్యలో బ్యాడ్ లైట్ సమస్య తలెత్తితే ప్రయోగాత్మకంగా పింక్ బాల్ ఉపయోగించేందుకు అహ్మదాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఐసీసీ వార్షిక బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. ఇరు జట్ల ముందస్తు అంగీకారంతో అమలు చేసే ఈ నిబంధన ప్రకారం.. సాంప్రదాయ రెడ్ బాల్‌తో ఆట సాధ్యం కాని పక్షంలో, మిగిలిన ఓవర్లను ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్‌తో పూర్తి చేస్తారు. టీ20 క్రికెట్లోని స్ట్రాటెజిక్ టైమౌట్ తరహాలోనే, ఇకపై టెస్ట్ మ్యాచ్‌లలోనూ డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచ్‌లు మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో వ్యూహాలను చర్చించేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో పాటు బౌలర్ల అక్రమ బౌలింగ్ శైలిని (చకింగ్) కట్టడి చేయడానికి ఆన్ ఫీల్డ్ అంపైర్లు హాక్- ఐ డేటాను పరిశీలించేలా నిబంధనలను సవరించారు. ఈ కొత్త ప్లేయింగ్ కండిషన్స్ అన్నింటినీ అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
కెనడా క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు
సభ్యత్వ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెట్ కెనడా’పై ఐసీసీ బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, కెనడా ఆటగాళ్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, సస్పెన్షన్ కాలంలోనూ ఆ దేశ జాతీయ జట్లు ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనేందుకు అర్హత కల్పించడమే కాకుండా, కఠిన పర్యవేక్షణలో నిధులను కూడా విడుదల చేయనున్నారు. ఇక, 2027 ఐసీసీ మహిళల చాంపియన్స్ ట్రోఫీని ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు నిర్వహించేలా విండోను మార్చారు.