పెర్త్: నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను అలరించిన బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) 15వ సీజన్లో పెర్త్ స్కాచర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన బీబీఎల్ ఫైనల్లో ఆ జట్టు.. సిడ్నీ సిక్సర్స్‌పై 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించి ఈ లీగ్‌లో ఆరో ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది.
ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ బ్యాటర్లు.. రిచర్డ్సన్ (3/32), డేవిడ్ పైన్ (3/18) రాణించడంతో 20 ఓవర్లలో 132 రన్స్‌కే ఆలౌట్ అయ్యారు. ఛేదనను పెర్త్ 17.3 ఓవర్లలోనే దంచేసింది. మిచెల్ మార్ష్ (44), అలెన్ (36) రాణించారు. ఫ్రాంచైజీ క్రికెట్లో ఒక జట్టు ఆరు టైటిల్లు గెలవడం ఇదే ప్రథమం. ఐపీఎల్లో తలా ఐదు టైటిల్స్‌తో చెన్నై, ముంబై రికార్డును పెర్త్ అధిగమించింది.