పాకిస్తాన్ కు చెందిన ఓ ఔత్సాహిక మహిళా క్రికెటర్ కు జాతీయ జట్టులో చోటు కల్పిస్తానని నమ్మించి.. ఆమెను లైంగికంగా వేధించిన మాజీ బౌలర్, జాతీయ స్థాయి కోచ్ నదీమ్ ఇక్బాల్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఇక్బాల్ ను సస్పెండ్ చేసిన పీసీబీ.. విచారణ నిమిత్తం అతడిని పోలీసులకు అప్పగించింది. ముల్తాన్ కు చెందిన మహిళా క్రికెటర్ ఫిర్యాదు మేరకు పీసీబీ ఈ నిర్ణయం తీసుకోవడం పాక్ క్రికెట్ లో సంచలనం కలిగించింది.
ఫిర్యాదు లో సదరు మహిళా క్రికెటర్.. ‘ముల్తాన్ కు చెందిన నేను కొన్నేళ్లుగా జాతీయ మహిళా జట్టులో చోటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఈ క్రమంలో నాకు నదీమ్ పరిచయమయ్యాడు. నాకు పాక్ వుమెన్స్ క్రికెట్ టీమ్ లో స్థానం కల్పిస్తానని.. ఎంప్లాయ్మెంట్ బోర్డులో కూడా నా పేరు ఉండేలా చూస్తానని హామీ ఇచ్చాడు…
ఆ తర్వాత తరుచూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. నదీమ్ తో పాటు ఆయన స్నేహితులు కూడా ఇదే విధంగా నన్ను వేధించారు. ఇందుకు సంబంధించిన వీడియో టేపులను తీసి వాటి ద్వారా నదీమ్ నన్ను బ్లాక్ మెయిల్ చేసేవాడు…’ అని పేర్కొంది.
1980, 90 లలో నదీమ్.. పాక్ మాజీ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ తో కలిసి దేశవాళీ క్రికెట్ ఆడాడు. వకార్ కంటే నదీమ్ గొప్ప బౌలరని.. కానీ పలు అనివార్య కారణాల వల్ల అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదని తెలుస్తున్నది. అయితే దేశవాళీలో మాత్రం నదీమ్.. 80 ఫస్ట్ క్లాస్ మ్యాచులలో 258 వికెట్లు పడగొట్టాడు.