ఐపీఎల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు హ్యాట్రిక్ తీసిన వారిలో చాహల్ మూడోవాడు. అమిత్ మిశ్రా (2008, 2011, 2013 సీజన్లలో) మూడుసార్లు ఈ ఘనత సాధించగా యువరాజ్ సింగ్ 2009 సీజన్లో రెండు సార్లు హ్యాట్రిక్ పడగొట్టాడు. చాహల్.. 2022, 2025లో ఈ ఘనత సాధించాడు
చెపాక్‌లో చెన్నై వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోవటం ఇది తొలిసారి
వరుస సీజన్లలో చెన్నై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడం ఇది మొదటిసారి
CSK | చెన్నై: పంజాబ్ కింగ్స్ సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో చెన్నైపై పంజా విసిరింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత ఇలాఖాలో వరుసగా ఐదో ఓటమిని ఖాతాలో వేసుకున్న చెన్నై ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. చెన్నై నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(41 బంతుల్లో 72, 5ఫోర్లు, 4సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్‌సింగ్(36 బంతుల్లో 54, 5ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. పతిరన(2/45), ఖలీల్(2/28) రెండేసి వికెట్లు తీశారు. తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. 19.2 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ కరన్ (47 బంతుల్లో 88, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (32) రాణించారు. కింగ్స్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ (4/32) ఈ సీజన్లో తొలి హ్యాట్రిక్‌ను నమోదుచేయగా అర్ష్‌దీప్ (2/25), యాన్సెన్ (2/30) తలా రెండు వికెట్లు పడగొట్టారు. అయ్యర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
యువ ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్ ఆరంభం నుంచే దూకుడు మంత్రాన్ని జపించడంతో పంజాబ్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఖలీల్ తొలి ఓవర్లోనే ప్రియాన్ష్ రెండు బౌండరీలతో ఇన్నింగ్స్‌ను ఆరంభించగా అన్షుల్ నాలుగో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 6, 4 దంచాడు. ఖలీలే వేసిన 5వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన ప్రియాన్ష్.. నాలుగో బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్ ప్లే తర్వాత స్పిన్నర్ల రాకతో కింగ్స్ స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. పతిరాన 11వ ఓవర్లో ఆఖరి బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా బౌండరీకి తరలించిన ప్రభ్‌సిమ్రన్.. ఈ సీజన్లో మూడో హాఫ్ సెంచరీని పూర్తిచేశాడు. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడిన ప్రభ్‌సిమ్రన్..నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రభ్‌సిమ్రన్‌ను అనుసరిస్తూ నేహాల్ వధేరా(5) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఓ వైపు సహచరులు నిష్క్రమిస్తున్నా..అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చెన్నై బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ లక్ష్యాన్ని అంతకంతకూ కరిగించుకుంటూ పోయాడు. ఆఖర్లో పది పరుగుల తేడాతో మూడు కీలక వికెట్లు శశాంక్(23), అయ్యర్, సూర్యాంశ్(1) చేజార్చుకున్నా..పంజాబ్ విజయతీరాలకు చేరింది.
చెన్నై ఇన్నింగ్స్‌లో కరన్ ఆటే హైలైట్. 6 ఓవర్లలో మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సీఎస్కేను బ్రెవిస్ అండతో అతడు ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ తప్ప చెన్నై బ్యాటర్లలో ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును దాటలేదు. ఈ సీజన్లో సరైన ఆరంభాలు లేక తంటాలు పడుతున్న చెన్నైకి ఈ మ్యాచ్‌లోనూ ఆ తిప్పలు తప్పలేదు. యువ ఓపెనర్లు రషీద్ (11), అయుశ్ (7) విఫలమవగా.. నాలుగో స్థానంలో వచ్చిన జడేజా (17) నాలుగు బౌండరీలతో అలరించినా అతడూ ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. పవర్ ప్లేలో చెన్నై చేసిన స్కోరు 48/3. ఈ క్రమంలో కరన్.. సీఎస్కే తనమీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హర్‌ప్రీత్ బ్రర్ 8వ ఓవర్లో సిక్స్ బాదిన అతడు.. చాహల్ బౌలింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు కొట్టాడు. కరన్‌కు అండగా నిలిచిన బ్రెవిస్.. క్రీజులో కుదురుకుంటున్న తరుణంలో 15వ ఓవర్లో అజ్మతుల్లా అతడిని బౌల్డ్ చేయడంతో 78 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్లో మూడో బంతికి డబుల్ తీసి హాఫ్ సెంచరీ సాధించిన కరన్ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. షెడ్గె వేసిన మరుసటి ఓవర్లో అతడు 6, 6, 4, 4తో ఏకంగా 26 రన్స్ రాబట్టాడు. ఒక ఓవర్లో చెన్నై ఇన్ని పరుగులు చేయడం ఈ సీజన్లో ఇదే ప్రథమం. కరన్‌తో పాటు దూబె కూడా క్రీజులో ఉండటంతో చెన్నై జోరు చూస్తే 220 ప్లస్ దాటుతుందేమో అనిపిస్తుంది. కానీ యాన్సన్ బౌలింగ్‌లో కరన్ ఔట్ అవడంతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ కుదేలైంది.
కరన్ నిష్క్రమించినా దూబెతో పాటు ధోని (11) క్రీజులో ఉండటంతో చెన్నై భారీ స్కోరే సాధిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ 18వ ఓవర్లో చాహల్.. 4 కీలక వికెట్లు (ఇందులోనే హ్యాట్రిక్) పడగొట్టి చెన్నైని కట్టడిచేశాడు. రెండో బంతికి ధోనిని ఔట్ చేసిన అతడు.. 4, 5, 6 బంతుల్లో హుడా (2), కంబోజ్, నూర్ అహ్మద్‌ను ఔట్ చేసి ఈ సీజన్లో తొలి, మొత్తంగా తన కెరీర్లో రెండో హ్యాట్రిక్‌ను నమోదుచేశాడు.
చెన్నై: 19.2 ఓవర్లలో 190 ఆలౌట్ (కరన్ 88, బ్రెవిస్ 32, చాహల్ 4/32, అర్ష్‌దీప్ 2/25); పంజాబ్: 19.4 ఓవర్లలో 194/6(అయ్యర్ 72, ప్రభ్‌సిమ్రన్ 54, ఖలీల్ 2/28, పతిరన 2/45)