సిడ్నీ: ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కమిన్స్ వచ్చే నెల 4 నుంచి గబ్బా(బ్రిస్బేన్) వేదికగా మొదలయ్యే డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
శుక్రవారం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఎలాంటి మార్పులు లేకుండానే 14 మందితో కూడిన జట్టునే ఎంపిక చేసింది. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కమిన్స్ స్థానంలో జట్టులోకి వచ్చిన బ్రెండన్ డగ్గెట్..స్టార్క్, స్కాట్ బోలాండ్తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. మరోవైపు సీనియర్ పేసర్ హాజిల్‌వుడ్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సీఏ పేర్కొంది. పెర్త్ వేదికగా రెండు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.