Paris Olympics 2024 : రెజ్లింగ్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ సంచలన విజయం సాధించారు. మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల రౌండ్ 16 విభాగంలో ప్రపంచ నెంబర్ 1 యూ సుసాకీని మట్టికరిపించింది. నాలుగు సార్లు రెజ్లింగ్ వరల్డ్ ఛాంపియన్, టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ అయిన యూ సుసాకీని ఓడించడం ద్వారా ఫోగట్ సంచలనం సృష్టించింది.
ఈ విజయంతో వినేశ్ ఫోగట్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. ఈ విభాగంలో క్వార్టర్ ఫైనల్ కూడా ఇవాళే జరగనుంది. గత ఏడాది రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో వినేశ్ ఫోగట్ చురుగ్గా పాల్గొన్నారు. ఆందోళనల్లో భాగంగా దాదాపు 40 రోజులపాటు సాటి రెజ్లర్లతో కలిసి ఢిల్లీ వీధుల్లో ఫూట్‌పాత్‌లపై నిద్రించారు. పోలీసులు ఆమెను రోడ్లపై కొడుతూ ఈడ్చుకెళ్లారు.
అంత ఆందోళన చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాను సాధించిన పతకాలను గంగానదిలో కలిపేందుకు కూడా సిద్ధపడ్డారు. గత ఒలింపిక్స్‌లో ఆమె మోకాలుకు గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇన్ని రకాలుగా ఒలింపిక్స్ ముందు అంత సమయం వృథా అయినా ఆమె ఇప్పుడు అద్భుతమైన ప్రదర్శనతో వరల్డ్ నెంబర్ 1ను మట్టికరిపించడం గమనార్హం.