Vinesh Phogat | పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కేసు తీర్పు ఈనెల 13న వెలువడనుంది. 50కిలోల ఫ్రీస్టయిల్ కేటగిరీలో వంద గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటుకు గురైన వినేశ్ కేసును అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానం(సీఏఎస్) అడ్హాక్ డివిజన్ శనివారం విచారింది.
వాస్తవానికి శనివారం రాత్రి తీర్పు రావాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేసినట్లు తెలిసింది. అయితే ఒలింపిక్స్ ముగిసిన రెండు రోజుల తర్వాత ఈ నెల13న తుది తీర్పు వెలువడనుందని ఐవోఏ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ), ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య(యూడబ్ల్యూడబ్ల్యూ) వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంపై వినేశ్..కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
వినేశ్ ఫోగాట్‌కు జపాన్ ఒలింపిక్ చాంపియన్ రెయి హిగుచి మద్దతుగా నిలిచాడు. టోక్యోలో తాను కూడా 50గ్రాముల తేడాతో అనర్హత వేటు ఎదుర్కొన్నానని హిగుచి ఎక్స్‌లో పేర్కొన్నాడు. ‘ఆ బాధేంటో నాకు తెలుసు. నీపై వస్తున్న మాటలను పట్టించుకోకు. కుంగుబాటు నుంచి పుంజుకోవడం అద్భుతమైన సందర్భం’అని రాసుకొచ్చాడు.