న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్ నీరజ్‌చోప్రాకు సమున్నత గౌరవం లభించింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్‌చోప్రాకు పరమ విశిష్ట సేవాపురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం మొత్తం 384 మంది భద్రతా సిబ్బందికి అవార్డులు ప్రకటించింది. ఇందులో 12 మందికి శౌర్యచక్ర పురస్కారాలు, 29 మందికి పరమ విశిష్ట సేవా పతకాలు, నలుగురికి ఉత్తమ యుద్ధ సేవా పతకాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందజేయనున్నారు. ప్రస్తుతం భారత ఆర్మీలోని ‘4వ రాజ్‌పుత్ రైఫిల్స్’లో సుబేదార్‌గా విధులు నిర్వర్తిస్తున్న నీరజ్ గతేడాది ఆగస్టులో జరిగిన విశ్వక్రీడల జావెలిన్ త్రోలో బరిసెను 87.58మీటర్ల దూరం విసిరి వందేండ్ల భారతీయుల కలను సాకారం చేశాడు. విశ్వక్రీడల చరిత్రలో అథ్లెటిక్స్‌లో భారత్‌కు స్వర్ణాన్ని అందించిన తొలి అథ్లెట్‌గా నీరజ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.