ఢిల్లీ: జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) పారా షట్లర్లపై వ్యవహరిస్తున్న తీరుపై పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నితేశ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎస్ఎల్3 కేటగిరీలో స్వర్ణం గెలిచిన నితేశ్ కుమార్‌తో పాటు ఇతర షట్లర్లనూ అభినందిస్తూ బాయ్ ‘ఎక్స్’లో చేసిన ట్వీట్‌కు అతడు ఘాటుగా రిైప్లె ఇచ్చాడు. ‘సోషల్ మీడియాలో అభినందించే పోస్టులు తప్ప (అది కూడా అరుదుగా) పారా షట్లర్ల పట్ల మీరు వ్యవహిరిస్తున్న తీరుపై మేం తీవ్ర అసంతృప్తితో ఉన్నాం. దయచేసి మమ్మల్ని బాయ్, సాయ్ నుంచి తప్పించి పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ)కు అప్పగించండి’ అంటూ చేసిన ట్వీట్ దుమారం రేపింది. ట్వీట్ తర్వాత అతడు పీటీఐతో మాట్లాడుతూ… ‘మేం (షట్లర్లు) పారా ఆసియా క్రీడల్లో 21 పతకాలు గెలిచాం. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సుమారు 15 పతకాలు పట్టుకొచ్చాం. పారాలింపిక్స్‌లో 5 మెడల్స్ నెగ్గాం. అయినా బాయ్ నుంచి మాకు కనీస గుర్తింపు కూడా దక్కలేదు. ఇదేం కొత్త కాదు. చాలా రోజుల నుంచి మాకు ఇది నిత్యకృత్యమే. వాళ్ల (బాయ్) దృష్టి మొత్తం అవయవాలు సక్రమంగా ఉన్న షట్లర్లపైనే ఉంటుంది తప్ప మమ్మల్ని కనీసం పట్టించుకునే నాథుడే ఉండడు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నిర్వహణ లోపాలతో ఆగమాగం
బాయ్‌లో పారా షట్లర్ల అడ్మినిస్ట్రేషన్ కూడా గందరగోళంగా ఉందని నితేశ్ అన్నాడు. ‘బాయ్‌లో మాకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకునేవాళ్లు ఒక్కరో ఇద్దరో ఉంటారు. దీనివల్ల మేం అడ్మినిస్ట్రేషన్ పరంగా తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నాం. కొన్ని టోర్నీలలో కీలక ఆటగాళ్ల పేర్లు కూడా ఉండవు. మేం ఏదైనా టూర్లకు వెళ్లాలనుకుంటే చివరి నిమిషం దాకా టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితులుంటాయి. హోటల్ గదులు కూడా టైమ్‌కు బుక్ అవ్వవు. కీలక టోర్నీలకు ముందు ఇలాంటి సమస్యలు మానసికంగా మమ్మల్ని చాలా వేధిస్తాయి’ అంటూ గోడు వెల్లబోసుకున్నాడు. పారా షట్లర్లంతా ఇటీవలే కేంద్ర క్రీడా మంత్రి (మన్సూఖ్ మాండవీయ)ని కలిసి ఆయనకు తమ సమస్యలు వివరించామని, ఆయన త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని చెప్పారని తెలిపాడు.