Ravi Shastri : ఒకప్పుడు ‘బజ్ బాట’తో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన ఇంగ్లండ్ యాషెస్ సిరీస్(Ashes Series)లో చతికిలపడుతోంది. ఈసారి యాషెస్ సిరీస్ గెలవాలనుకున్న ఆ జట్టు పేలవ ప్రదర్శనతో కంగుతిన్నది. హ్యాట్రిక్ ఓటములతో యాషెస్ కలను కల్లలు చేసుకుంది. స్టార్లతో నిండిన ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్ కొత్త కుర్రాళ్లలా కుప్పకూలడంతో ఆసీస్ పర్యటన తర్వాత హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullum)పై వేటు పడనుందనే వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్ గాడీలో పడాలంటే అది రవి శాస్త్రి (Ravi Shastri) వల్లే అవుతోందని అంటున్నాడు ఆ దేశ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్(Monty Panesar).
క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లండ్. కానీ, ఇప్పుడు ఆ జట్టు ఆట పాతాళానికి చేరింది. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీని సమం చేసిన ఉత్సాహంతో ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇంగ్లండ్‌కు అక్కడ పరాజయాలే పలకరిస్తున్నాయి. దూకుడే మంత్రగా ఆడే ఆ జట్టు ఐదు రోజులు ఆడలేక ఆతిథ్య దేశానికి సిరీస్ అప్పగించింది. దాంతో.. కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను తప్పించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. బజ్‌బాల్ ఆటకు మంగళం పాడి.. సంప్రదాయ మళ్లీ ఆటతోనే ఇంగ్లండ్ పుంజుకుంటుందని పలువురి అభిప్రాయం.
అందుకే.. కొత్త కోచ్ ఎంపిక అనివార్యమనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ టీమిండియా మాజీ క్రికెటర్ రవి శాస్త్రిని సరైనోడిగా ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే.. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం తెలిసిన శాస్త్రి అయితేనే తమ జట్టును గట్టెక్కిస్తాడని అతడి నమ్మకం.
Monty Panesar insists Ravi Shastri to become the next head coach of England Cricket #MontyPanesar #RaviShastri #EnglandCricket #Insidesport #CricketTwitter pic.twitter.com/V29zyr13tJ
— InsideSport (@InsideSportIND) December 25, 2025
ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం అతడికి తెలుసు. మానసికంగా, శారీరకంగా, వ్యూహాత్మకంగా ఆసీస్ ఆటగాళ్ల బలహీనతలను అతడు అనుకూలంగా మలచుకోగల సమర్ధుడు. అందుకే.. బ్రెండన్ మెక్కల్లమ్ వెళ్లిపోయాక ఇంగ్లండ్ తదుపరి కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికవ్వాలి. అతడైతేనే జట్టును మళ్లీ గెలుపు తోవ తొక్కిస్తాడు అని పనేసర్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Monty Panesar backs Ravi Shastri to become the new England Head Coach. (Ravish Bisht).#Ashes2025 #AUSvENG #RaviShastri pic.twitter.com/LjHQKsHECb
— 𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭𝐗𝐭𝐫𝐚. (@cricket12craze) December 25, 2025
భారత కోచ్‌గా అద్భుత విజయాలు సాధించిన రవి శాస్త్రి నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో తన ముద్ర వేశాడ. ఆసీస్ వ్యూహాలను తిప్పికొడుతూ టీమిండియాను విజేతగా నిలిపాడు. అంతేకాదు రవి శాస్త్రి హయాంలో భారత్ వరల్డ్ నంబర్ 1గా నిలిచింది. డబ్ల్యూటీసీ (WTC 2021) తొలి సీజన్ ఫైనల్ కూడా ఆడింది. సుదీర్ఘ ఫార్మాట్లో కోచ్‌గా విజయవంతమైన శాస్త్రినే ఇంగ్లండ్‌కు సరైనోడు అని పనేసర్ భావిస్తున్నాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా అభిమానులను అలరిస్తున్న శాస్త్రి.. ఒకవేళ ఇంగ్లండ్ బోర్డు కోచ్ పదవి ఆఫర్ చేస్తే ఏం అంటాడో చూడాలి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం మెల్బోర్న్ స్టేడియంలో నాలుగో టెస్టు జరుగనుంది. పెర్త్, గబ్బా, అడిలైడ్‌లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. మెల్బోర్న్ టెస్టులో విజయంతో బోణీ కొడుతుందా? లేదంటే ఆడలేక మ్యాచ్ అప్పగించేస్తుందా? చూడాలి.