లాహోర్: టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్‌ను బహిష్కరించడానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. ఈ టోర్నీలో ఆడాలా? వద్దా? అన్నదానిపై మరో వారం రోజుల్లో తేల్చుకోనుంది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ.. సోమవారం లాహోర్‌లో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను కలిసిన అనంతరం ఎక్స్ వేదికగా స్పందించారు. ట్వీట్లో నఖ్వీ.. ‘బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ వ్యవహరించిన తీరుపై ప్రధానితో సమావేశమై సుదీర్ఘంగా చర్చించాం.
అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రానున్న శుక్రవారం లేదా సోమవారం లోపు తుది నిర్ణయాన్ని వెల్లడిస్తాం’ అని తెలిపాడు. బంగ్లాకు మద్దతుగా టీ20 ప్రపంచకప్‌నకు పూర్తిగా జట్టును పంపకుండా ఉండటమా? లేక ఫిబ్రవరి 15న కొలంబోతో దాయాది భారత్‌తో జరిగే ఒక్క మ్యాచ్‌ను బహిష్కరించాలా? అన్నదానిపై నఖ్వీ, ప్రధానితో చర్చించినట్టు తెలుస్తున్నది. మరి దీనిపై పాక్ ప్రభుత్వం, పీసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే!