కరాచీ: భారత పర్యటనకు పాకిస్థాన్ హాకీ జూనియర్ జట్టు మొగ్గు చూపుతున్నది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ వేదికగా (నవంబర్ 24- డిసెంబర్ 5) జరుగనున్న ఐహెచ్ఎఫ్ జూనియర్ హాకీ ప్రపంచకప్‌కు ఆ బృందం సిద్ధమవుతున్నది. వీసాల సమస్యతో 2016 మెగాటోర్నీలో పాల్గొనకపోయిన పాక్ ఈసారి ముందస్తు జాగ్రత్తలతో భారత పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నది. ‘గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా చూసుకుంటున్నాం. పీఎస్బీ, సంబంధిత మంత్రిత్వ శాఖల అనుమతి తీసుకుని వీసాల కోసం అన్ని పత్రాలు సమర్పించాం’ అని పాక్ హాకీ సమాఖ్య అధ్యక్షుడు సజ్జాద్ ఖోకర్ తెలిపారు. వీసాల విషయమై ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు నరీందర్ బాత్రాతో సంప్రదింపులు చేశామన్నారు. 25 మంది ఆటగాళ్లతో పాటు 9 మంది అధికారులకు సంబంధించిన వీసాలకు మేము దరఖాస్తు చేశామని పేర్కొన్నారు. మరోవైపు కరోనా నిబంధనల కారణంగా ఇంగ్లండ్ ఈ వరల్డ్ కప్‌కు దూరమైన సంగతి తెలిసిందే.