ఇస్లామాబాద్: పాకిస్థాన్ బ్యాటర్ హైదర్ అలీ( Haider Ali)పై ఆ దేశ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ విధించింది. క్రికెటర్ హైదర్ అలీపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. బ్రిటన్‌లో అతను ఓ బాలికను రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ కేసులో అతన్ని అరెస్టు చేసి, బెయిల్‌పై రిలీజ్ చేశారు. ఇంగ్లండ్‌లో పాకిస్థాన్ షహీన్స్ జట్టు టూర్ చేస్తున్నది. ఈ ఘటన ఆ సమయంలో జరిగినట్లు తెలుస్తోంది.
క్రిమినల్ కేసు కోణంలో విచారణ జరుగుతున్నది. గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 24 ఏళ్ల హైదర్ అలీ ఎటువంటి నేరానికి పాల్పడ్డారన్న విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించలేదు. రేప్ జరిగినట్లు ఓ రిపోర్టు రావడంతో క్రికెటర్‌ను అరెస్టు చేసినట్లు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు తెలిపారు. జూలై 23వ తేదీన అత్యాచార ఘటన జరిగిందన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అతనికి బెయిల్ మంజూరీ చేశారు.
సెకండ్ టైర్ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీలకు పాకిస్థాన్ షాహీన్స్ బృందాన్ని పంపిస్తుంటారు. 15 రోజుల టూరు జూలై 22వ తేదీన ప్రారంభమైంది. కేసులో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో హైదర్ అలీని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు పీసీబీ పేర్కొన్నది. పాకిస్థాన్ జాతీయ జట్టు తరపున హైదర్ అలీ రెండు వన్డేలు, 35 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతను 2020లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఎదుర్కొంటున్న కేసులో .. హైదర్ అలీకి లీగల్ సపోర్టు ఇస్తున్నట్లు పీసీబీ చెప్పింది.