Asia Cup 2025 : క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వరల్డ్ ఫేమస్ అని మనందరికి తెలుసు. అంతర్జాతీయ టోర్నీల్లో ఇరుజట్లు తలపడుతున్నాయంటే నరాలు తెగిపోయేంత ఉత్కంఠ ఉంటుంది. ప్రతి బాల్.. ప్రతి రన్.. ఫలితాన్ని మార్చేస్తుంటే స్టేడియంలోని అభిమానులు మునివేళ్లపై నిలబడుతారు. అంతలా ఆసక్తికరంగా సాగే దాయాదుల మ్యాచ్‌కు ఆసియా కప్ (Asia Cup 2025)లో తెరలేవనుంది. ఈ గేమ్ కోసం ఫ్యాన్స్ కోటికళ్లతో ఎదురుచూస్తుంటే.. పాకిస్థాన్ మాజీ ఆటగాడు బసిత్ అలీ (Basit Ali) మాత్రం టీమిండియాను ప్రాధేయపడుతున్నాడు. తమ జట్టు ఎక్కడ దారుణంగా ఓడిపోతుందేమోననే భయంతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని అతడు భారత జట్టును కోరుతున్నాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ ఆసియా కప్ మొదలు కానుంది. టోర్నీలోనే హై ఓల్టేజ్ మ్యాచ్ అయిన భారత్, పాక్ పోరు దుబాయ్‌లో సెప్టెంబర్ 14న జరుగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ను టీమిండియా క్రికెటర్లు బాయ్‌కాట్ చేయాలని అంటున్నాడు బసిత్ అలీ. ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకూడదని టీమిండియాను కోరుతున్నా. లేదంటే మా జట్టు ఘోర ఓటమి చవిచూడడం ఖాయం. భారత ప్లేయర్లు పాక్‌ను ఎంత దారుణంగా ఓడిస్తారో నాకు తెలుసు. అది మనం ఊహించలేం కూడా. కాబట్టి దయచేసి ఆసియా కప్‌లో మాతో ఆడకండి.
Basit Ali said – “I pray India refuse to play against Pakistan in the Asia Cup, just like how they did at the World Championships of Legends. India hame Itni buri tarah maarenge na ki aap soch bhi nhi sakte (India will beat us so badly you can’t even imagine)”. pic.twitter.com/2V1f3dMRBc
— Bharat Sports Official 🇮🇳 (@TikamMe23035051) August 14, 2025
ఇటీవలే వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆఫ్ లెజెండ్స్‌లో పాకిస్థాన్‌తో ఆడేందుకు భారత మాజీ ఆటగాళ్లు నిరాకరించారు. మీరూ కూడా అలానే చేయండి అని గేమ్ ప్లాన్ యూట్యూబ్ ఛానెల్లో బసితో వెల్లడించాడు. పాక్ మాజీ క్రికెటర్ బసిత్ ఆందోళన నిజమే మరి. ఎందుకంటే వరల్డ్ కప్ టోర్నీల్లో భారత జట్టుకు పాక్‌పై మెరుగైన రికార్డు ఉంది. ఇక టీ20ల్లో అయితే 13 మ్యాచుల్లో పదింటా టీమిండియానే విజేతగా నిలిచింది. గతేడాది పొట్టి వరల్డ్ కప్‌లోనూ దాయాదికి మూడు చెరువుల నీళ్లు తాగించింది భారత జట్టు.