Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం(Babar Azam) ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్( Lanka Premier League)లో దుమ్మరేపుతున్నాడు. ప్రపంచంలోని గొప్ప క్రికెటర్లలో ఒకడైన బాబర్ ఆటకంటే తన పెళ్లి విషయమై తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా అతడు పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ భారత్‌లో వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) ముగిశాక మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టనున్నాడట.
బాబర్ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు వధువు ఎవరో తెలుసా..? వాళ్ల బంధువుల పిల్లనే అతను పెళ్లాడనున్నాడు. అయితే ఇప్పటివరకూ బాబర్ ఫ్యామిలీ మాత్రం ఆమె పేరు వెల్లడించలేదు.
బాబర్ అజాం
ఈ ఏడాది ఆరంభంలో పాక్ క్రికెటర్లలో చాలామంది పెళ్లి చేసుకున్నారు. హ్యారిస్ రౌఫ్(Harris Rouf), షాహీన్ ఆఫ్రీదీ(Shaheen Afridi), యాసిర్ అలీ.. ఇలా స్టార్ ఆటగాళ్లంతా వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. దాంతో, బాబర్ ఎక్కడ కనిపించినా అందరూ అతడి పెళ్లి గురించే అడిగేవాళ్లు. ఓసారి మీడియా సమావేశంలో బాబర్‌ను మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని అడిగారు. అందుకు అతను ‘పెళ్లి జరగడం లేదని బాధపడడం లేదు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అదే అవుతుంది’ అని తెలివిగా సమాధానం చెప్పాడు.
బాబర్ ఆజం, క్రిస్ గేల్
బాబర్ సారథ్యంలో పాక్ జట్టు నిరుడు టీ20 కప్ ఫైనల్ చేరింది. ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాంతో, ఈ ఏడాది భారత్‌లో జరుగనున్న వన్డే వరల్డ్ కప్‌పై పాక్ కన్నేసింది. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ అక్టోబర్ 14న తలపడనున్నాయి. అంతకంటే ముందు ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు తాడోపేడో తేల్చుకోనున్నాయి. లంక ప్రీమియర్ లీగ్(Lanka Premier League)లో తొలి సెంచరీ కొట్టిన బాబర్ టీ20ల్లో పదో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, పొట్టి క్రికెట్లో 10కి పైగా సెంచరీలు బాదిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్(Chris Gayle) రికార్డు సమం చేశాడు. అయితే.. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీల రికార్డు మాత్రం గేల్ పేరిటే ఉంది.