Ons Jubeur : మహిళల టెన్నిస్‌లో ఒకప్పటి సంచలనం ఓన్స్ జుబెర్ (Ons Jubeur) అభిమానులకు తీపికబురు చెప్పింది. మాజీ వరల్డ్ నంబర్ 2 అయిన జుబెర్ తాను తల్లి కాబోతున్నానని వెల్లడించింది. ఈ విషయాన్ని నవంబర్ 10(సోమవారం)న ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంది జుబెర్. మొదటిసారి తల్లి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్న టెన్నిస్ స్టార్.. ప్రెగ్నెన్సీ కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరం అవుతున్నట్టు పేర్కొంది.
‘కొత్త ఉత్సాహం కోసం టెన్నిస్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నా. మేము త్వరలోనే క్యూట్ బేబీని ఆహ్వానించబోతున్నాం. అందుకే కొన్నిరోజులు ఆటకు దూరమవుతున్నాను. ఏప్రిల్‌లో మేము ముగ్గురం కాబోతున్నాం.’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా జుబెర్ రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ చూసిన టెన్నిస్ స్టార్లు కాబోయే పేరెంట్స్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
ఇన్‌స్టా పోస్ట్‌లో ఓన్స్, ఆమె భర్త కరీమ్ కమౌన్లు చిన్న రాకెట్, చిన్న డ్రెస్‌ను చూపిస్తూ మేము తల్లిదండ్రులం కాబోతున్నాం అని వెల్లడించారు. దాంతో, మరియా సక్కారి, డరియా కసత్కిన, బెలిండా బెన్సికా, బర్బొరా క్రెజికోవా, నవొమి ఒసాకా, కరోలిన్ వోజ్నియాకి, తదితరులు జుబెర్ దంపతులుకు శుభాకాంక్షలు చెప్పారు. ట్యునీషియాకు చెందిన జుబెర్ 2015లో ఫెన్సర్ అయిన కరీమ్ కమౌన్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతడు ఆమెకు ఫిట్నెస్ కోచ్‌గా మెలకువలు నేర్పాడు.
మూడేళ్ల క్రితం డబ్ల్యూటీఏ టూర్లో జుబెర్ చెలరేగింది. వరుస విజయాలతో జోరు చూపించిన తను.. వరల్డ్ నంబర్ 2 ర్యాంక్ కైవసం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి ఆఫ్రికా, అరబ్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది జుబెర్. ఆ తర్వాత కూడా అదే విధంగా ఆడిన తను.. మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ (వింబుల్డన్ 2022, 2023, యూఎస్ ఓపెన్ 2022) చేరింది. అదే ఉత్సాహంతో ఐదు డబ్ల్యూటీఏ సింగిల్ టైటిళ్లు గెలుపొందింది. అయితే.. కెరీర్ గొప్పగా సాగుతున్న వేళ ఈ ఏడాది ఆరంభంలో జుబెర్ మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి సారించేందుకు బ్రేక్ తీసుకుంది.