కొలంబో: క్రికెట్లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. జట్లు ఏవైనా, ఆటగాళ్లు ఎవరైనా స్లెడ్జింగ్ కామన్‌గా జరుగుతంది. ఆట రసపట్టు మీద ఉన్నప్పుడు ఆటగాళ్లు తమ భావోద్వేగాలను అదుపుచేసుకోలేక ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతుంటారు. నూరేళ్లకుపైగా చరిత్ర కలిగిన క్రికెట్లో అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాథ్యూ హెడేన్, న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండెన్ మెక్‌కల్లమ్‌లతో తనకు జరిగిన గొడవల గురించి తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ వెల్లడించాడు.
ఒకసారి ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు రోజు స్టేడియం క్యాంటీన్లో ఆసీస్ ఓపెనర్ మ్యాథ్యూ హెడెన్‌కు, తనకు మధ్య గొడవ జరిగిందని అక్తర్ గుర్తుచేసుకున్నాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో మెక్కల్లమ్ తనపైకి పోర్క్ తీసుకుని వచ్చాడు. తాను కూడా అతని మీదకు కత్తితో వెళ్లానని చెప్పాడు. సమయానికి మా ట్రెయినర్ అడ్డుపడటంతో ప్రమాదం తప్పిందని, లేదంటే ఇద్దరం కొట్టుకునే వాళ్లమని అన్నాడు. హెడెన్ తన దగ్గర నుంచి చట్నీ తీసేయడం గొడవకు దారి తీసిందని తెలిపాడు.
అదేవిధంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా కూడా ఆ జట్టు కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను తాను బెదిరించానని షోయబ్ అక్తర్ చెప్పాడు. తన బౌలింగ్‌లో మెక్కల్లమ్ ముందుకు వచ్చి ఆడటాన్ని తాను సహించలేకపోయానని అన్నాడు. మరో బంతి వేస్తుండగా మెక్కల్లమ్ ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం చేశాడని, దాంతో తాను అతని దగ్గరికి వెళ్తూ.. ‘నీ కంటి చూపు బాగుందా..? నేను నీ కంటికి షోయబ్ మాలిక్ లాగా కనిపిస్తున్నానా..? నా బౌలింగ్‌లో ముందుకు వచ్చి ఎందుకు ఆడుతున్నావ్..? ఇంకోసారి ముందుకోస్తే నీ మీద బీమర్ వేస్తా. నిన్ను చంపేస్తా. ఇక్కడ కుదరకపోయినా హోటల్లో నిన్ను కచ్చితంగా చంపేస్తా.’ అని బెదిరించానని అక్తర్ గుర్తు చేసుకున్నాడు. ఆటలో అలా చేసినా తర్వాత తన ప్రవర్తన తనకే నచ్చేది కాదని చెప్పాడు.