చెన్నై: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో టెస్టు మ్యాచ్ జరుగుతన్న సమయంలో.. స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ అకస్మాత్తుగా చెన్నైకు బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు జరిగిన ఘటన గురించి అశ్విన్ భార్య ప్రీతి(Prithi ) ఓ ఆసక్తికర పోస్టు చేసింది. ఆ రోజే టెస్టుల్లో 500వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న అశ్విన్.. ఆట ముగియగానే సడెన్‌గా స్వంత ఇంటికి పయనం అయ్యాడు. తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని తెలుసుకోవడంతో అతను ఫ్లయిట్ ఎక్కేశాడు. నిజానికి దీని గురించి అశ్విన్ ఎక్కువగా మాట్లాడలేదు. కానీ అతని భార్య ప్రీతి ఓ పత్రికకు రాసిన కాలమ్‌లో కొన్ని విషయాలు చెప్పింది.
అందరం ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో అశ్విన్ తల్లి అకస్మాత్తుగా కుప్పకూలందని, ఆ సమయంలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లామని ప్రీతి తెలిపింది. అయితే ఈ విషయాన్ని అశ్విన్‌కు చెప్పకుండా.. మరో క్రికెటర్ చతేశ్వర్ పుజారాకు ప్రీతి ఫోన్ చేసింది. స్పిన్నర్ అశ్విన్‌ను చెన్నైకు రప్పించేందుకు ఏ రూట్ బెటర్ అన్న విషయాన్ని తెలుసుకునేందకు ఆమె పూజారాకు ఫోన్ చేసినట్లు తెలిసింది.
రాజ్‌కోట్ టెస్టులో అశ్విన్ 500 వికెట్లు తీసుకోగానే తమకు కంగ్రాట్స్ మెసేజ్‌లు వెల్లువెత్తాయని, ఆ సమయంలో తమ అత్త గట్టిగా అరిచిందని, ఆమె కింద పడిపోయిందని తెలిపింది. కానీ ఆ సమయంలో అశ్విన్‌కు ఈ విషయాన్ని చెప్పలేదని, ఎందుకంటే చెన్నైకి, రాజ్‌కోట్‌కు మధ్య సరైన ఫ్లయిట్ కనెక్టివిటీ లేదని ప్రీతి పేర్కొన్నది. అందుకే పూజారాకు ఫోన్ చేశానని, అతని ఫ్యామిలీ చాలా హెల్ప్ చేసినట్లు ఆమె తెలిపింది. తమకు రూట్ క్లారిటీ వచ్చిన తర్వాత.. అప్పుడు తల్లి గురించి అశ్విన్‌కు చెప్పినట్లు ప్రీతి పేర్కొన్నది. స్కానింగ్ తీసిన తర్వాత అశ్విన్ ఉంటే బాగుంటుందని డాక్టర్లు చెప్పారని, ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పగానే అతని నోట మాట రాలేదని, దాదాపు 25 నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్నా మళ్లీ ఫోన్ చేశారని, అశ్విన్ ఇంటికి చేరుకోవడంలో రోహిత్, రాహుల్ ద్రావిడ్‌తో పాటు బీసీసీఐ వర్గాలు పోషించిన పాత్రకు ఆమె థ్యాంక్స్ తెలిపింది.
అర్థరాత్రి చెన్నై చేరుకున్న అశ్విన్.. ఐసీయూలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లాడని, అదృష్టవశాత్తు తన తల్లి రికవరీ అయ్యిందని, ఆ తర్వాత రాజ్‌కోట్‌కు అశ్విన్ తిరుగు ప్రయాణం అయినట్లు ఆమె తెలిపింది.