వన్డే వరల్డ్ కప్‌లో మూడో విజయం కోసం తహతహలాడుతున్న సఫారీలు పసికూన నెదర్లాండ్స్‌పై ముప్పేట దాడికి దిగుతున్నారు. ధర్మశాల వేదికగా సౌతాఫ్రికా – నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న 15వ లీగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న డచ్ జట్టు.. 21 ఓవర్లు ముగిసేసరికి 5 ప్రధాన వికెట్లు కోల్పోయి 82 పరుగులు మాత్రమే చేసింది. వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ఆరంభమైన ఈ మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే.
వర్షం తర్వాత ఆట ఆరంభమవగా.. డచ్ ఓపెనర్లు విక్రమ్‌జీత్ సింగ్ (2), మ్యాక్స్ ఓడౌడ్ (18)లు వెంటవెంటనే వెనుదిరిగారు. లుంగి ఎంగిడి వేసిన మూడో ఓవర్లోనే రెండు బౌండరీలు కొట్టిన ఓడౌడ్.. అతడే వేసిన ఐదో ఓవర్లో ఐదో బంతినీ థర్డ్ మెన్ దిశగా బౌండరీ తరలించాడు. ఆరు ఓవర్లకు 22 పరుగులు జోడించిన ఈ జోడీని రబాడా విడదీశాడు. అతడు వేసిన ఏడో ఓవర్లో తొలి బంతికే విక్రమ్‌జిత్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మరుసటి ఓవర్లోనే మార్కో జాన్సెన్.. ఓడౌడ్‌ను ఔట్ చేశాడు. తొలి పది ఓవర్లకు 32 పరుగులు మాత్రమే చేసిన డచ్.. ఆ తర్వాత కూడా తడబడింది. రబాడా వేసిన 11వ ఓవర్లో.. బాస్ డీ లీడె (2) వికెట్ల ముందు దొరికిపోయాడు. కోయెట్జ్ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికే అకర్మన్ (13) కూడా బౌల్డ్ అయ్యాడు. ఎంగిడి వేసిన 21వ ఓవర్లో రెండో బంతికి సిబ్రండ్ (19) కూడా పెవిలియన్ చేరాడు. 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో డచ్ జట్టు మిగిలిన సగం ఓవర్లలో ఏ మేరకు నిలబడుతుందో చూడాలి.