అబుధాబి: కీలకమైన సెమీస్ పోరులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ సమిష్టిగా రాణించారు. స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ లేకుండా బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు జోస్ బట్లర్ (29), జానీ బెయిర్‌స్టో (13) మంచి ఆరంభమే అందించారు. ఆ తర్వాత మిల్నే బౌలింగ్‌లో బెయిర్‌స్టో అవుటయ్యాడు.
దీంతో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలన్ (41) కూడా రాణించాడు. బట్లర్ అవుటైన తర్వాత వచ్చిన మొయీన్ అలీ (51 నాటౌట్) కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట్లో నిదానంగా ఆడిన అతను చివర్లో వేగం పెంచాడు. లియామ్ లివింగ్స్టన్ (17) కూడా ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టి అవుటయ్యాడు.
ఇన్నింగ్స్ చివరి బంతికి మోర్గాన్ (4 నాటౌట్) ఇచ్చిన క్యాచ్‌ను డీప్ కవర్లో ఫిలిప్స్ జారవిడిచాడు. కీలకమైన బ్యాట్స్‌మెన్ అందరూ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ 166 పరుగులు చేసింది. కివీస్‌కు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.