Rahul Dravid | వన్డే ప్రపంచకప్‌తో భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. అయితే, ప్రస్తుతం కాంట్రాక్టు ముగియడంతో ప్రస్తుతం రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మళ్లీ టీమిండియా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడం ఇష్టం లేదని సమాచారం. తాజాగా ద్రవిడ్ మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి పునరాగమనం చేయబోతున్నట్లుగా తెలుస్తున్నది. ఐపీఎల్‌లోని లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు పలు ఫ్రాంచైజీలు ద్రవిడ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
పరిస్థితులు అనుకూలిస్తే రాహుల్ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌కు ముందే లక్నో సూపర్ జెయింట్ జట్టుకు మెంటర్‌గా మారే అవకాశాలున్నాయి. అయితే, ద్రవిడ్, బీసీసీఐ మధ్య జరిగే చర్చలపైనే ఏం జరుగుతుందనేది ఆధారపడి ఉన్నది. 2021 ప్రపంచకప్ తర్వాత 2023 వన్డే వరల్డ్ కప్ వరకు రెండేళ్ల కాంటాక్టుపై టీమిండియా ప్రధాన కోచ్‌గా నియామకమయ్యాడు. రవిశాస్త్రి పదవీకాలం ముగిసిన తర్వాత అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ప్రస్తుత కార్యదర్శి జైషా ప్రధాన కోచ్‌గా ద్రవిడ్‌ను తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.
ద్రవిడ్ సారథ్యంలో టీమిండియా ఐసీసీ ట్రోఫీలను గెలువలేకపోయింది. కానీ, మాజీ కెప్టెన్ శిక్షణలో ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. అలాగే టీమిండియా ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ జట్టుగా అవతరించింది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్‌లో భారత జట్టు వరుసగా పది మ్యాచ్‌లు గెలిచింది. అయితే, టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌లో తడబడి ఓటమిపాలైంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లోనూ టీమిండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ప్రస్తుత సమాచారం మేరకు రాహుల్ ద్రవిడ్‌తో బీసీసీఐ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. ఇందులో రాహుల్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తున్నది. అయితే, రాహుల్ ద్రవిడ్ తన పదవీకాలాన్ని పొడిగించాలని కోరే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నట్లు తెలుస్తున్నది. టీమిండియా బిజీ షెడ్యూల్, తరుచూ ప్రయాణాల నేపథ్యంలో భారత ప్రధాన కోచ్‌గా కొనసాగడం సాధ్యం కాదని, కుటుంబంతో గడపాలని కోరుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఐపీఎల్‌లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే ఐపీఎల్ కేవలం రెండునెలల పాటు కొనసాగుతుంది. దీంతో కుటుంబంతో కలిసి ఉండేందుకు తగినంత సమయం దొరకడంతో పాటు క్రికెట్ దగ్గరగా ఉన్నట్లుగా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం.
లక్నో సూపర్ జెయింట్స్ ద్రవిడ్‌ను తమ సపోర్టు స్టాఫ్‌లో భాగంగా చేసుకోవాలని కోరుకుంటున్నది. అయితే, ద్రవిడ్ భారత ప్రధాన కోచ్‌గా కొనసాగకపోతే, అతను తన జట్టులో చేర్చుకోవడానికి ‘ది వాల్’తో ఒప్పందం చేసుకుని ఉండేది. అదే సమయంలో గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మెంటార్‌గా చేరిన తర్వాత ఎల్ఎస్జీలో మెంటార్ పోస్ట్ ఎలాగూ ఖాళీగానే ఉంది. గంభీర్ గత రెండేళ్లుగా లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తూ జట్టును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, భారత మాజీ ఓపెనర్ ఇప్పుడు ఏడేళ్ల పాటు తాను నాయకత్వం వహించిన జట్టు కేకేఆర్ జట్టులోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు.
లక్నో ఫ్రాంచైజీ ఇప్పటికే ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్‌ను తొలగించింది. వచ్చే సీజన్ నుంచి జస్టిన్ లాంగర్‌కు జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించింది. అన్ని అనుకున్నట్లుగా జరిగే రాహుల్ ద్రవిడ్ సైతం లక్నో జట్టులో వచ్చే అవకాశం ఉంది. ద్రవిడ్‌ను చేర్చుకునే ఆలోచనలో మరో ఫ్రాంచైజీ ఉంది. మరో వైపు రాజస్థాన్ రాయల్స్ సైతం చర్చలు జరుపుతున్నది. ద్రవిడ్ రాజస్థాన్ ఫ్రాంచైజీకి చాలా సంవత్సరాలు క్రికెట్ ఆడాడు. అలాగే కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అలాగే, రాజస్థాన్‌కు మెంటార్‌గానూ వ్యవహరించాడు. అయితే, ప్రస్తుతం ద్రవిడ్‌ను మెంటర్‌గా తీసుకోవడంలో ఎల్ఎస్జీ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తున్నది.
ద్రవిడ్ మళ్లీ టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరించకపోతే ప్రస్తుతం నేషనల్ అకాడమీ చీఫ్‌గా కొనసాగుతున్న వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గతకొంతకాలంగా ద్రవిడ్ విరామం తీసుకున్న సమయంలో లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తూ వచ్చాడు. ఎన్సీఏతో లక్ష్మణ్‌కు ఉన్న అనుబంధం నేపథ్యంలో.. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు యువ భారత జట్టు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.