Novak Djokovic : ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic) సర్జరీ చేయించుకున్నాడు. తన కుడి మోకాలి(Right Knee)కి విజయవంతంగా ఆపరేషన్ అయిందని గురువారం జకోవిచ్ వెల్లడించాడు. అంతేకాదు త్వరలోనే కోర్టులో అడుగుపెడుతా అని సెర్బియా స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో జకోవిచ్ చేతి కర్రల సాయంతో నిలబడి ఉన్నాడు. ఆ
‘మోకాలి గాయం కారణంగా నిన్న నేను కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే.. మీ అందరితో సంతోషకరమైన వార్త పంచుకుంటున్నా. నాకు సర్జరీ సక్సెస్ అయింది. ఈ కష్ట సమయంలో నాకు అన్నివిధాల తోడుగా ఉన్న వైద్య బృందానికి, నాకు మద్ధతుగా నిలుస్తున్న అభిమానులకు అభినందనలు. మునపటిలా ఆరోగ్యంగా మారేందుకు నేను ప్రయత్నిస్తాను. త్వరలోనే కోర్టులో అడుగుపెడుతాను’ అని జకోవిచ్ తెలిపాడు.
అయితే.. వింబుల్డన్(Wimbledon) టోర్నీలోపు జకో పూర్తిగా కోలుకుంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. జూలై 1 నుంచి 14 వ తేదీ వరకు ఈ గ్రాండ్‌స్లామ్ జరుగనుంది. ఒకవేళ వింబుల్డన్ మిస్ అయితే.. అనంతరం జూలై 27 నుంచి ఆగస్టు 4 వరకు జరిగే ప్యారిస్ ఒలింపిక్స్‌లో జకోవిచ్ ఆడే చాన్స్ ఉంది.
డిఫెండింగ్ చాంపియన్‌గా ఫ్రెంచ్ ఓపెన్‌లో అడుగుపెట్టిన జకోవిచ్ అర్ధాంతరంగా తప్పుకున్నాడు. కాపర్ రూడ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మోకాలి గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే కోర్టును వీడాడు. 2023లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు (Grandslam Title) కొల్లగొట్టిన జకో.. పురుషుల టెన్నిస్ చరిత్రలో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సైతం తన్నుకుపోయాడు.