పారిస్: తన సుదీర్ఘ కెరీర్లో ఏడాదిన్నర కాలంగా ఊరిస్తున్న 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్.. ఫ్రెంచ్ ఓపెన్‌ను విజయంతో ఆరంభించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ఆరో సీడ్ జొకో.. 6-3, 6-3, 6-3తో మెకంజీ మెక్‌డొనాల్డ్ (యూఎస్)ను వరుస సెట్లలో చిత్తు చేశాడు. ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన కూడా లేకుండానే జొకో మ్యాచ్‌ను ముగించాడు. సోమవారం రాత్రి ముగిసిన పోరులో ఒకటో సీడ్ యానిక్ సిన్నర్.. 6-4, 6-3, 7-5తో ఆర్థర్ (ఫ్రాన్స్)పై అలవోక విజయం సాధించాడు. మూడో సీడ్ అలగ్జాండర్ జ్వెరెవ్.. 6-3, 6-3, 6-4తో లర్నర్ టైన్ (యూఎస్)ను ఓడించాడు. కాగా స్టార్ ప్లేయర్ డేనియల్ మెద్వెదెవ్కు మాత్రం తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. మెద్వెదెవ్.. 5-7, 3-6, 6-4, 6-1, 5-7తో కామెరూన్ నోరీ (బ్రిటన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్ (అమెరికా) 6-2, 6-2తో ఒలివియా (ఆస్ట్రేలియా)పై నెగ్గగా.. మూడో సీడ్ జెస్సికా పెగుల (యూఎస్) 6-2, 6-4తో టొడొని (రొమానియా)ను చిత్తు చేసి రెండో రౌండ్‌కు ముందంజ వేసింది.